ఇక E20 మాత్రమే..! ప్యూర్ పెట్రోల్ మర్చిపోండి-పార్లమెంట్లో తేల్చేసిన కేంద్రం..!
పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలిపిన ఈ20 (E20) మిశ్రమంపై దేశవ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా కేంద్రం మాత్రం దీనిపై వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పేసింది. ఓవైపు ఈ20 మిశ్రమం ప్రయోగదశలోనే ఉందని తాజాగా సుప్రీంకోర్టుకు చెప్పిన ప్రభుత్వం.. ఇవాళ పార్లమెంట్ లో మాత్రం మాటమార్చి దీన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చేసినట్లు ప్రకటించింది. అంతే కాదు ఇకపై దేశంలో ఈ20 క్లీన్ చమురు మాత్రమే ఉంటుందని, స్వచ్ఛమైన పెట్రోల్ అందుబాటులో ఉండబోదని తేల్చేసింది.
ఈ20 పెట్రోల్ సురక్షితమైన, స్వచ్ఛమైన, సాంకేతికంగా అధునాతనమైన ఇంధనమని, ఇథనాల్ లేని పెట్రోల్ విధానానికి తిరిగి వెళ్లే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్ లో స్పష్టం చేసింది. అలాగే ఇథనాల్ మిశ్రమాన్ని 20% కంటే ఎక్కువగా పెంచే నిర్ణయం కూడా తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ పార్లమెంటుకు తెలిపారు. తక్కువ ప్రమాణాలకు తిరిగి వెళ్లడం కాకుండా, ఉన్నతమైన, మెరుగైన సాంకేతికత వైపు పయనించడమే ప్రభుత్వ విధానమని వెల్లడించారు.

E20 పెట్రోల్ వాడకం వల్ల ఇంజిన్ పాడవుతుందని, మైలేజీ తగ్గుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అయితే, విస్తృతమైన ప్రయోగశాల పరీక్షలు, నీతి ఆయోగ్, ఇతర సంస్థల క్షేత్రస్థాయి పరిశీలనలు, వాస్తవ వినియోగ డేటా ఆధారంగా E20 వల్ల ఇంజిన్లకు ఎటువంటి అసాధారణ నష్టం లేదా అరుగుదల కలగదని రుజువైందని ప్రభుత్వం తెలిపింది. ఇథనాల్ కారణంగా ఇంజిన్ వైఫల్యంపై ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఒక ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ నివేదించిందని మంత్రి తెలిపారు. అలాగే 85% ఇథనాల్ కలిగిన E85 ఇంధనం కేవలం 'ఫ్లెక్స్-ఫ్యూయల్' వాహనాల కోసం మాత్రమే ఖరారు చేశామని, ఇది సాధారణ పెట్రోల్ సరఫరాలో భాగం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications