బంగాళాఖాతంలో ఉత్పాతం- అతి భారీ భూకంపం
Bay of Bengal earthquake: బంగాళాఖాతంలో ఉత్పాతం చోటు చేసుకుంది. పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత పలు ప్రాంతాలపై పడింది. పోర్ట్ బ్లెయిర్ సహా పలు ప్రాంతాల్లో భూమి ప్రకంపించింది. దీని తీవ్రత అటు మలేసియా, ఇండోనేసియాలపైనా పడింది.తీర ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. కెరటాలు ఉవ్వెత్తున ఎగిశాయి. తీర ప్రాంతంలో అలజడి ఏర్పడింది.
బంగాళాఖాతంలో తాజాగా సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల‌్‌పై 5.4గా రికార్డయింది. జర్మనీ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్.. దీన్ని 6.7గా నిర్ధారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అండమాన్ ద్వీపానికి 12.49 ఉత్తర అక్షాంశం, 93.83 తూర్పు రేఖాంశం మధ్య ఈ మధ్యాహ్నం సరిగ్గా 12:06 నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.

అండమాన్ నికోబార్ ఐలండ్ కు నైరుతి దిశగా 63, ఇండొనేసియాలోని బందా ఏక్ కు ఆగ్నేయ దిశగా 42, ఒడిశాకు ఈశాన్య దిక్కున 198 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించింది. సముద్ర ఉపరితలం నుంచి 90 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ వివరించింది.
దీని ప్రభావం అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంపై పడింది. పలు ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు పోటెత్తాయి. మత్స్యకార గ్రామాలు భయాందోళనలకు గురయ్యాయి. తొలుత- సునామీ సంభవింవచవచ్చంటూ వార్తలొచ్చాయి గానీ అలాంటి హెచ్చరికలేవీ కూడా జారీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ భూకంప తీవ్రత పలు ప్రాంతాల్లో కనిపించింది. పలుచోట్ల భూమి ప్రకంపించింది. లక్షణ్ పూర్, సీతాపూర్, హెన్రీ లారెన్స్ ఐలాండ్స్, మధుబన్ ఆర్వీ, వైపర్ ఐలాండ్స్.. వంటి ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. అటు ఇండోనేసియాలో బండా ఏక్ వంటి ప్రాంతాల్లో భూమి స్వల్పంగా ప్రకంపించింది.
ఆయా ప్రాంతాల్లో సముద్ర తీరం అల్లకల్లోలమైంది. కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కెరటాలు ఎగిసిపడ్డాయి. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన సమాచారం ఇప్పటివరకు లేదు. అండమాన్ సముద్రం, దాని చుట్టుపక్కల గల ద్వీపాలు క్రియాశీలక భూకంపాల జోన్ లో ఉన్నాయి. దీని వల్ల ఈ ప్రాంతం తరచుగా భూకంపాలు, సునామీ, తుఫాన్లు వంటి వైపరీత్యాల బారిన పడుతుంటుంది.












Click it and Unblock the Notifications