దావుద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేస్: మంత్రి అరెస్ట్‌తో కేసీఆర్ ఆరోపణలు నిజం అయ్యాయా?
ముంబై: మహారాష్ట్రలో శివసేన సారథ్యంలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంజా విసిరింది. కూటమిలో భాగస్వామిగా ఉంటోన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్ధవ్ థాకరే మంత్రివర్గ సహచరుడు నవాబ్ మాలిక్ అరెస్ట్ అయ్యారు. ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. ముంబై పేలుళ్ల సూత్రధారి మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లుగా నిర్ధారించారు.

మహారాష్ట్ర కేబినెట్‌లో రెండో మంత్రి
ఈ అరెస్ట్ వ్యవహారం- మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలను పుట్టించింది. ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని ప్రభుత్వంలో అరెస్టయిన రెండో మంత్రి నవాబ్ మాలిక్. ఇదివరకు ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్టయిన విషయం తెలిసిందే. అనిల్ దేశ్‌ముఖ్‌ను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులే అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్న సీనియర్ నాయకుడు నవాబ్ మాలిక్ అరెస్ట్ వ్యవహారంతో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ఈ ఉదయం నుంచీ విచారణ..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నవాబ్ మాలిక్‌ను ఈ ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఈడీ అధికారులు ఇదివరకే సమన్లను జారీ చేశారు. దీనితో ఆయన ఈ ఉదయం 8 గంటలకు ముంబైలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అప్పటి నుంచీ ఆయనను విచారించారు. ఈ సందర్భంగా నవాబ్ మాలిక్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు.

మనీలాండరింగ్ ప్రమేయం..
మనీలాండరింగ్‌లో ఆయన ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఆయనను అరెస్ట్ చేసినట్లు కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. దావుద్ ఇబ్రహీంతో పాటు అతని సోదరుడు అనీస్, ఇక్బాల్, ఛోటా షకీల్.. ఇతర అండర్ వరల్డ్ మాఫియాతో నవాబ్ మాలిక్‌కు మనీలాండరింగ్ సంబంధాలు ఉన్నట్లు ఈడీ అధికారులు ధృవీకరించారు. కొద్దిరోజుల కిందటే వారు దావుద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ నివాసంపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులే ఇప్పుడు నవాబ్ మాలిక్ అరెస్ట్‌కు దారి తీసిందనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.

హసీనా పార్కర్ బాడీగార్డ్‌తో..
దావుద్ ఇబ్రహీం కుడిభుజంగా చెప్పుకొనే సర్దార్ షావలి ఖాన్, హసీనా పార్కర్ బాడీగార్డ్ సలీం పటేల్ ద్వారా నవాబ్ మాలిక్- ఈ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. తాజా పరిణామాల అనంతరం సర్దార్ షావలి ఖాన్, సలీం పటేల్ కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్కానింగ్ పరిధిలోకి వెళ్లిపోయారు. వారి ఆర్థిక మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్నారు. అలాగే- నవాబ్ మాలిక్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న మరికొందరు వ్యాపారస్తులను కూడా విచారించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
Recommended Video

కేసీఆర్ వ్యాఖ్యలు..
ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ భేటీ ముగిసిన అనంతరం వారిద్దరూ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను వంటి దర్యాప్తు ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు. కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజుల్లోనే ఏకంగా మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications