ఆ నిర్మాత పట్టిందల్లా బంగారమే.. వర్షంలా కురుస్తున్న డబ్బు
టాలీవుడ్‌లో ప్రస్తుతం అగ్ర నిర్మాతల పరిస్థితి చూస్తే 'కత్తి మీద సాము'లా ఉంది. ఎంత పెద్ద సినిమా తీసినా, ఎలాంటి హిట్ టాక్ వచ్చినా పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడం గగనమైపోతోంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను శాసించిన దిల్ రాజు సరైన విజయం లేక ఇబ్బంది పడుతుంటే.. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ సైతం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీకి కూడా ఈ మధ్య కాలం అంతగా కలిసిరావడం లేదు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా ఎటువంటి హంగామా లేని ఒక మిడ్-రేంజ్ ప్రొడ్యూసర్ మాత్రం టాలీవుడ్‌లో సైలెంట్‌గా సంచలనాలు సృష్టిస్తూ, పట్టిందల్లా బంగారమే అన్నట్లు దూసుకుపోతున్నారు. ఆయనే 'షైన్ స్క్రీన్స్' అధినేత సాహు గారపాటి.
సాహు కెరీర్‌ను మార్చిన 'జాక్‌పాట్'
సాహు గారపాటి టాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి, వరుస విజయాలు అందుకోవడానికి దర్శకుడు అనిల్ రావిపూడితో ఉన్న క్రేజీ బాండింగ్ ప్రధాన కారణం. వీరిద్దరి కాంబినేషనే సాహుకు తిరుగులేని మైలేజ్‌ను ఇచ్చింది. నందమూరి బాలకృష్ణతో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, సాహు గారపాటిని పెద్ద లీగ్‌లోకి తీసుకొచ్చింది. భారీ లాభాలను అందించింది.

అంతా లాభాల జాతరే!
'భగవంత్ కేసరి' ఇచ్చిన ఊపుతో సాహు గారపాటి జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. గత ఏడాది ఆయన నిర్మాణంలో వచ్చిన 'కిష్కింధపురి' వైవిధ్యమైన టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ ఏడాది లో అయితే సాహు గారపాటి రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్ళిపోయింది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో షైన్ స్క్రీన్స్ నిర్మించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి, సాహు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ ఒక్క సినిమాతోనే ఆయన భారీగా లాభాలు ఆర్జించారు. కేవలం తెలుగులోనే కాదు, సాహు గారపాటి బిజినెస్ మైండ్ మాలీవుడ్‌పైనా పడింది. మలయాళంలో అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన 'వాళా-2' అక్కడ కల్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో భారీ రిటర్న్స్ రాబట్టిన చిత్రంగా సాహుకు ఇది మరో బంపర్ ప్రాఫిట్‌ను అందించింది.
ముంగిట మరో క్రేజీ ప్రాజెక్ట్
ప్రస్తుతం వరుస సక్సెస్‌ల జోరులో ఉన్న సాహు.. మరో క్రేజీ కాంబినేషన్‌ను లైన్లో పెట్టారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పైనే నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తోడు వెంకీ, కళ్యాణ్ రామ్ లాంటి క్రేజీ కాంబో సెట్ అవ్వడంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ముందే లెక్కలు వేస్తున్నాయి.పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలే కథల ఎంపికలో, బడ్జెట్ మేనేజ్‌మెంట్‌లో తడబడుతున్న వేళ.. సాహు గారపాటి మాత్రం కంటెంట్‌ను, కాంబినేషన్లను నమ్ముకుని టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా నిలిచారు. ప్రస్తుతం సాహు ప్లాన్ చేస్తున్న విధానం చూస్తుంటే ఆయనకు రాబోయే రోజుల్లో మరిన్ని జాక్‌పాట్‌లు ఖాయంగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications