మాజీ మంత్రి శిష్యుడు అందర్, రూ 187 కోట్ల స్కామ్, తలపట్టుకున్న సీఎం, ఈడీ ఎంట్రీతో ?
కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వానికి తలనొప్పి మొదలైయ్యింది. కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ కేసుకు సంబంధించి బుధవారం ఈడీ అధికారులు కర్ణాటకతో పాటు హైదరాబాద్ లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇదే సమయంలో బెంగళూరు, హైదరాబాద్ లో ఈడీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్‌లో రూ. 187 కోట్లు కుంభకోణం జరిగిందని ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ మంత్రి బి.నాగేంద్ర సన్నిహితుడు హరీష్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది.

వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో జరిగిన భారీ కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం ఉదయం మహర్షి వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంపై దాడి చేశారు.
ఈ సమయంలో ఈడీ అధికారులు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అందరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని గంటల తరువాత కర్ణాటక మాజీ మంత్రి బి. నాగేంద్ర సన్నిహితుడు హరీష్‌ని అరెస్ట్ చేశారు. అనంతరం అరెస్టు చేసిన హరీశ్‌ను బెంగళూరులోని శాంతినగర్ ఈడీ కార్యాలయానికి తరలించారు.
వాల్మీకి కార్పొరేషన్ స్కాం కేసులో అరెస్టయిన హరీష్ పాత్ర ఏమిటి?,
వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆర్థిక వ్యవహారాల్లో మంత్రి నాగేంద్ర సన్నిహితుడు హరీశ్ ఎందుకు జోక్యం చేసుకున్నాడు, కార్పొరేషన్ అధికారులపై ఎందుకు ఒత్తిడి తెచ్చాడు అని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

మాజీ మంత్రి నాగేంద్ర తరపున ఒత్తిడి తెచ్చిన హరీష్ తరువాత నగదు లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సత్యనారాయణ వర్మ నుంచి హరీష్ డబ్బు అందుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఏప్రిల్ 2వ వారంలో పద్మనాభం నుండి రూ. 25 లక్షలు. హరీష్‌కి డబ్బులు అందాయని అధికారులు అంటున్నారు.
వాల్మీకి కార్పొరేషన్ అధికారి పద్మనాభం స్వయంగా డబ్బులు ఇచ్చారని వాంగ్మూలం ఇచ్చారు. శ్రీనిధి సాగర్ హోటల్ లో ఒకసారి, బెంగళూరులోని బీబీఎంపీ కార్యాలయంలో మరోసారి డబ్బులు హరీష్ కు ఇఛ్చాడని సమాచారం. ఆ తర్వాత మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగేంద్రకు హవాలా డబ్బు, బంగారు బిస్కెట్లు అందినట్లు అనుమానం వచ్చింది. మంత్రి నాగేంద్ర పేరుతో రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల లావాదేవీలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అందువల్ల తదుపరి విచారణలో హరీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. హరీష్ నోరు విప్పితే నాగేంద్ర కొంప మునిగేటట్లు ఉందని తెలిసింది.












Click it and Unblock the Notifications