ఘోర ప్రమాదం... హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు... 8 మంది అక్కడికక్కడే మృతి...
బిహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన హోటల్లోకి ఓ ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ట్రక్కును తగలబెట్టారు. సహాయక చర్యల కోసం వచ్చిన పోలీసులు,అధికారులపై రాళ్లు రువ్వారు. బిహార్‌లోని నలంద జిల్లా తెల్హద పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... తెల్హద పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన ఓ హోటల్ ఉంది. ఆదివారం(మార్చి 29) సాయంత్రం సమయంలో జెహానాబాద్ వైపు నుంచి వస్తున్న ఓ ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పి హోటల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్ సిబ్బందితో సహా 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్,అందులో ఉన్న ఇతరులు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు.

ప్రమాద ఘటన గురించి తెలిసి సహాయక చర్యల కోసం పోలీసులు,స్థానిక అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆగ్రహంగా ఉన్న స్థానికులు వారిపై రాళ్లు రువ్వారు. ట్రక్కును తగలబెట్టారు. పోలీస్ వాహనాన్ని కూడా వారు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన సొంత జిల్లా నలందలో జరిగిన ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని జిల్లా మెజిస్ట్రేట్‌ను ఆదేశించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రస్తుతం మృతులను పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications