గుజరాత్ రెండో దశ ప్రచారం సమాప్తం-భయపెడుతున్న ఓటింగ్ శాతం-ఈసీ చెప్పిన కారణమిదే..!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ దశలో మొత్తం 93 అసెంబ్లీ స్ధానాలకు పోలింగ్ జరగబోతోంది. ఎల్లుండి జరిగే ఈ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఎన్నికల సంఘంతో పాటు రాజకీయ పార్టీల్ని సైతం ఓ అంశం భయపెడుతోంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఉత్తర, మధ్య గుజరాత్ లోని 14 జిల్లాల పరిధిలో ఉన్న 93 అసెంబ్లీ సీట్లకు ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తొలిదశ ఎన్నికల్లో ఓటింగ్ శాతాలు చూశాక రాజకీయ పార్టీలతో పాటు ఈసీ కూడా షాకైంది. తొలిదశలో కేవలం 63.3 శాతం పోలింగ్ నమోదు కావడంపై ఈసీలో అంతర్మథనం మొదలైంది. అదే సమయంలో రాజకీయ పార్టీలకు కూడా భయం మొదలైంది.ఓటర్ల నిర్లిప్తత తమను ఎక్కడ కొంప ముంచుతుందోనన్న భయం వారిలో కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వాస్తవ పరిస్ధితులపై నివేదికలు తెప్పించుకుంది. దీన్ని బట్టి చూస్తే గుజరాత్ లోని పట్టణ ప్రాంతాల ఓటర్లు ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొనడం లేదని తేలింది. పట్టణ ఓటర్ల నిర్లిప్తత వల్లే తొలిదశలో ఓటింగ్ శాతాలు తక్కువగా నమోదైనట్లు ఈసీ నిర్దారించింది. తొలిదశ పోలింగ్ జరిగిన సూరత్, రాజ్ కోట్, జామ్ నగర్లో అయితే రాష్ట్ర సగటు కంటే తక్కువగా పోలింగ్ నమోదు కావడం అందరినీ కలవరపెడుతోంది. అయితే గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇవే ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ శాతాలు నమోదు కావడంతో ఇప్పుడూ అదే పరిస్దితి ఉన్నట్లు తేలడంతో ఈసీ కాస్త ఊపిరి పీల్చుకుంటోంది.












Click it and Unblock the Notifications