ఎన్నికల షెడ్యూల్ ఖరారు - ఇక హోరా హోరీ..!!
దేశ వ్యాప్తంగా పార్లమెంట్..ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల సంఘంలో కొత్తగా నియమితులైన ఇద్దరు కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల సంసిద్దత పైన కీలక సమీక్ష చేస్తున్నారు. రేపు (శనివారం) మధ్నాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముహూర్తంగా ఖరారైంది. ఏపీలో తొలి విడతలోనే పోలింగ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది.
రేపు షెడ్యూల్
రేపు(శనివారం) మధ్నాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ఖరారు కానుంది. ఇదే సమయంలో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కసరత్తు ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంల తరలింపు, భద్రతా దళాల మొహరింపు, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు.

హోరా హోరీ పోరు
ఈ సారి ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరిగే అవకాశం ఉంది. ఏపీలో తొలి విడతలో జరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. 2019 లో మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 18న నోటిఫికేషన్ జారీ అయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరగ్గా, మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సారి మార్చి 16న షెడ్యూల్ వస్తుండటంతో ఏపీలో ఏప్రిల్ 20-25 మధ్య పోలింగ్ ఉంటుందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఏపీలో తొలి విడతలోనే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. గతంలోనూ తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించటం ద్వారా..ఇతర రాష్ట్రాలకు అధికారులు, భద్రతా సిబ్బందిని వినియోగంచుకోవటానికి ఎన్నికల సంఘానికి వెసులుబాటు ఉంటుంది.
ప్రతిష్ఠాత్మక ఎన్నికలు
తొలి విడతలో ఏపీతో పాటుగా తెలంగాణలోనూ ఎన్నికలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ఏపీలో ఇప్పటికే ఎన్నికల సమరం హీటెక్కింది. వైసీపీని ఓడించే లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పాటయ్యాయి. జగన్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ - వామపక్షాలు కూటమిగా జత కట్టాయి. రేపు (శనివారం) సీఎం జగన్ తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దుల తుది జాబితా ఇడుపుల పాయ వేదికగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రకటించనున్నారు. ఇటు టీడీపీ కూటమి సైతం అభ్యర్దుల పైన దాదాపు స్పష్టత ఇచ్చింది. షెడ్యూల్ వచ్చిన సమయం నుంచి ప్రచారం హీటెక్కనుంది. రెండు వైపులా మేనిఫెస్టోలు కీలకం కానున్నాయి. దీంతో..ఏపీలో ఈ షెడ్యూల్ ప్రకటన ద్వారా రాజకీయ పోరు మరింత ఉత్కంఠగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications