కేంద్రాన్ని కోర్డుకీడ్చిన ఎలాన్ మస్క్..! ఇక తాడో పేడో..!!
భారత్ లో ఓవైపు తన ఉత్పత్తుల్ని ఏదో విధంగా చొప్పించేందుకు ప్రయత్నిస్తున్న బిలియనీర్ ఎలాన్ మస్క్.. మరోవైపు ఇవాళ కేంద్రానికి భారీ షాకిచ్చాడు. ఏకంగా కేంద్రాన్ని కోర్డు కీడ్చాడు. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ కు అడ్డంకులు సృష్టిస్తున్న కేంద్రంపై కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కేంద్రం-మస్క్ మధ్య మరో వివాదానికి ఆజ్యం పోసినట్లయింది.
గతంలో ట్విట్టర్ గా ఉన్న మైక్రో బ్లాగింగ్ సైట్ ను కొనుగోలు చేసి ఎక్స్ గా పేరు మార్చేసిన ఎలాన్ మస్క్ కు కేంద్రం ఢిల్లీ ఆందోళనల సమయంలో తొలిసారి షాకిచ్చింది. కేంద్రానికి వ్యతిరేకంగా జనం పెట్టే ట్వీట్లను బ్లాక్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చింది. అయితే దీనికి ఎక్స్ అంగీకరించలేదు. దీంతో మొదలైన వివాదం కేంద్రం ఐటీ చట్టాన్ని సవరించే వరకూ వెళ్లింది. అయినా ఎక్స్ వెనక్కి తగ్గడం లేదు. కానీ కేంద్రం మాత్రం ఎక్స్ లో వివాదాస్పద ట్వీట్లను బ్లాక్ చేస్తూనే ఉంది. దీనిపై ఇప్పుడు ఎక్స్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది.

తమ ప్లాట్ ఫామ్ ఎక్స్ పై ట్వీట్, ఇతర కంటెంట్‌ను తొలగించాలని డిమాండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 79(3)(b)ని ఉపయోగించే విధానాన్ని సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశంలో ప్రభుత్వ అధికారులు చట్టపరమైన విధానాలను ఉల్లంఘిస్తున్నారని, ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి చట్టవిరుద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని ఎక్స్ తన పిటిషన్లో పేర్కొంది.

ఐటీ చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులు చెప్పినప్పుడు కంటెంట్‌ను తీసివేయకపోతే లేదా బ్లాక్ చేయకపోతే, ఎక్స్ లాంటి ప్లాట్‌ఫామ్‌లు తమ చట్టపరమైన రక్షణను కోల్పోతాయి. దీనిని సేఫ్ హార్బర్ అని పిలుస్తారు. అయితే ఈ సెక్షన్ ప్రభుత్వానికి కంటెంట్‌ను బ్లాక్ చేసే అధికారాలను ఇవ్వదని ఎక్స్ వాదిస్తోంది. దీనిపై ఇప్పుడు కర్నాటక హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది. దీంతో ఎక్స్, కేంద్రం మధ్య సాగుతున్న పోరు పతాక స్థాయికి చేరినట్లయింది.












Click it and Unblock the Notifications