విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం
విశాఖపట్నం నుండి దేశ రాజధానికి బయలుదేరిన ఇండిగో విమానంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్ లో అవాంఛనీయ శబ్దాలు వినిపించాయి. దీంతో పైలెట్లు అప్రమత్తం అయ్యారు. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బందికి తక్షణ సమాచారాన్ని అందజేశారు. దీంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఘటనతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్ర అలజడి చెలరేగింది. బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్ అది. దీని నంబర్ 6ఈ 579 (6E 579). విశాఖపట్నం నుండి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఇంజిన్ వైఫల్యం సంభవించే అవకాశం ఉందని సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడానికి యుద్ధప్రాతిపదికన అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా రన్‌వే నంబర్ 28ను కేటాయించారు. ఇతర విమానాల కోసం దీన్ని మూసివేశారు.

పైలట్ల చాకచక్యం, విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అత్యవసర ప్రోటోకాల్‌లను పాటిస్తూ ఇండిగో విమానం ఉదయం సరిగ్గా 10:54 నిమిషాలకు ఎయిర్ పోర్ట్ రన్‌వే 28పై సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. ఏదైనా అవాంఛనీయ పరిస్థితిని వెంటనే ఎదుర్కోవడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు.
ఈ సమయంలో ఈ విమానంలో మొత్తం 161 మంది ప్రయాణికులు ఉన్నారు. సురక్షిత ల్యాండింగ్ అనంతరం, వారందరినీ ఎలాంటి ఆటంకం లేకుండా విమానం నుండి బయటకు తరలించారు. ప్రాథమిక తనిఖీల తర్వాత, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో సాంకేతిక లోపం కారణంగానే పైలెట్లు అత్యవసర కాల్ చేశారు.
ఇండిగో సాంకేతిక బృందం ప్రస్తుతం విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. లోపం ఎంత తీవ్రమైనదో, తలెత్తడానికి గల కారణాలను గుర్తించడానికి సమగ్ర విచారణ జరుగుతోంది. దేశీయ కమర్షియల్ విమానాల్లో 50 శాతం వరకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని పార్లమెంటరీ ప్యానెల్ ఇదివరకే వెల్లడించింది.












Click it and Unblock the Notifications