ప్రముఖ నృత్యకారుడు, శాస్త్రీయ నృత్య చరిత్రకారుడు ‘పద్మశ్రీ’ సునీల్ కొఠారీ కన్నుమూత
ప్రముఖ శాస్త్రీయ నృత్యకారుడు, నృత్య చరిత్రకారుడు, విమర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీల్ కొఠారీ కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. ఆదివారం గుండెపోటుకు గురైన ఆయన.. ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించగా అక్కడే తుదిశ్వాస విడిచారు.
గత నెల ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆయన స్నేహితురాలు విధా లాల్ ప్రకటన విడుదల చేశారు. 'దాదాపు నెల కిందట కొఠారీ కొవిడ్ బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు' అని లాల్ వెల్లడించారు.

ముంబైలో 1933 డిసెంబర్ 20న జన్మించిన ఆయన చార్టడ్ అకౌంటెంట్‌గా ఉత్తీర్ణత సాధించారు. అయితే ఆ తర్వాత భారతీయ నృత్య కళలవైపు మళ్లారు. సుమారు 20కి పైగా పుస్తకాలు రాశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్ నృత్యాలపై ఆయన పుస్తకాలు రచించారు. ఉదయ్ శంకర్, రుక్మిణీ దేవి అరుండల్ ఫొటో బయోగ్రఫీలు రచించారు.
నృత్య విభాగంలో ఆయన చేసిన సేవలకు గానూ కొఠారీ ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ను గౌరవించింది. 1995లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు సైతం అందుకున్నారు.












Click it and Unblock the Notifications