భీకర ఎన్‌కౌంటర్, పదుల సంఖ్యలో నక్సల్స్ మృతి
నిశ్శబ్దంగా ఉన్న కీకారణ్యం ఒక్కసారిగా తూటాల శబ్దంలో ఉలిక్కిపడింది. భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య భీకర ఫైరింగ్ జరిగింది. దేశ భద్రతకు కీలకంగా మారిన ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు మరోసారి ఉద్రిక్తతకు దారి తీశాయి. ఒకవైపు కూంబింగ్ ఆపరేషన్లు, మరోవైపు ఎదురుకాల్పులు... పరిస్థితి క్షణక్షణానికి ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
జార్ఖండ్‌లోని చైబాసా సమీపంలోని సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దట్టమైన అడవుల్లో దాగి ఉన్న మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఉదయం 10:39 గంటల వరకు వచ్చిన సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని జార్ఖండ్ పోలీసులు వెల్లడించారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 10 మంది మావోయిస్టులు హతమయ్యారని అధికారులు తెలిపారు. ఘటన అనంతరం మృతుల వద్ద నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, నాసా, రెండు .303 రైఫిళ్లు, బీజీఎల్ లాంచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌తో మావోయిస్టు నెట్‌వర్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.
జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ, మృతుల్లో జాతీయ పార్కు ప్రాంతంలో క్రియాశీలంగా ఉన్న కీలక మావోయిస్టు నేత దిలీప్ బెడ్జా కూడా ఉన్నాడని వెల్లడించారు. భద్రతా బలగాల దూకుడు ఆపరేషన్లతో మావోయిస్టులు వెనుకడుగు వేస్తున్నారని, అటవీ ప్రాంతాల్లో శాంతి స్థాపన దిశగా ఇది కీలక ముందడుగని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పరిధిలో ఉన్న బీజాపూర్ జిల్లాలో జనవరి 17-18 తేదీల్లో జరిగిన ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అరణ్య ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ముందుకు కదిలాయి. ఒక్కసారిగా కాల్పులు మొదలవ్వడంతో అడవంతా తూటాల శబ్దాలతో దద్దరిల్లింది. గంటల పాటు కొనసాగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు పైచేయి సాధించాయి.
తాజా సారండా ఎన్‌కౌంటర్, బీజాపూర్ ఘటనలతో.. మావోయిజంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దూకుడు మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్న వేళ, రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications