మళ్లీ రగిలిన కశ్మీర్.. ఏడు గంటల నుంచి కొనసాగుతున్న ఎన్ కౌంటర్.. ఒకరి మృతి
జమ్మూ కశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఏడు గంటలుగా ఎన్ కౌంటర్ జరుగుతూనే ఉంది. ఒకరు మృతి చెందారు.
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందారు.
దీంతో ఎన్ కౌంటర్ జరుగుతున్న ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. ఉగ్రవాదులు ఒక ఇంట్లో తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు భద్రతాదళాలు చదూర ఏరియాలోని దుర్బాగ్ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి.

ఈ గాలింపు చర్యలు కాల్పులకు దారితీశాయి. భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో భద్రతాదళాలు ఎదురు కాల్పులు జరిపాయని, ఎన్ కౌంటర్ కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని భద్రతా దళాలు చుట్టుముట్టాయి.
నిరసనకారుల ఆందోళన..
అయితే ఎన్ కౌంటర్ జరుగుతున్న ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్న నిరసనకారులు భద్రతాదళాలపై రాళ్లు రువ్వారు. పోలీసు ఆపరేషన్ కు అవాంతరాలు కల్పించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ నేపథ్యంలో భద్రతా దళాలు నిరసన కారులపై పెల్లెట్ గన్స్ తో కాల్పులు జరపగా ఒక నిరసనకారుని మెడను బుల్లెట్ తాకింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే అతడు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
నిరసన కారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు పెల్లెట్ గన్ లతో జరిపిన కాల్పుల్లో నలుగురు ఆందోళనకారులు గాయపడ్డారు. ఏడు గంటలుగా ఎన్ కౌంటర్ జరుగుతూనే ఉంది.












Click it and Unblock the Notifications