భార్యను కిడ్నాప్ చేసిన సైకో భర్త, మేడమ్ ప్రభుత్వ ఉద్యోగి, ఇద్దరూ అడ్రస్ లేరు !
చెన్నై/పుదుకోటై: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం ఇద్దరూ ప్రేమించుకుని హ్యాపీగా తిరిగారు. పెద్దలను ఎదిరించిన యువతి ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే భార్య మీద అనుమానం పెంచుకున్న భర్త అతని భార్యను సైకోలాగా టార్చర్ పెట్టాడు. చివరికి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. నిన్ను చంపేస్తానని భార్యను బెదిరించిన భర్త ఆమెను కిడ్నాప్ చేసి నెల రోజులు అయినా ఇంత వరకు ఇద్దరి ఆచూకిలేదు.
తమిళనాడులోని పుదుకోటై జిల్లాలో ఉమా మహేశ్వరి అనే యువతి నివాసం ఉంటున్నది. మైలాడుతురై మున్సిపల్ కార్యాలయంలో ఉమా జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఉమాకు పల్లవరాయనపతై గ్రామానికి చెందిన మారిముత్తుతో పరిచయం ఏర్పడింది. చివరికి ఉమా, మారిముత్తల పరిచయం ప్రేమగా మారింది. ఉమా ప్రేమ వ్యవహారాన్ని ఉమా మహేశ్వరి ఇంట్లో తీవ్రంగా వ్యతిరేకించారు.

పెద్దలను ఎదిరించిన ఉమా డిసెంబర్ 4వ తేదీ 2022 లో ఇంటి నుంచి పారిపోయి ఆమె ప్రియుడు మారిముత్తును గుడిలో వివాహం చేసుకుంది. తరువాత మైలాడుతురైలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొన్న మారిముత్తు, ఉమా దంపతులు అక్కడే నివాసం ఉంటున్నారు. ఉమా ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. పెళ్లి అయిన 4 నెలల తర్వాత మహేశ్వరి తన తల్లి ధనలక్ష్మికి ఫోన్ చేసి బోరున విలపించింది. తన భర్త మారిముత్తు సైకోలా తనపై అనుమానం పెంచుకున్నాడని, తనకు అక్రమ సంబంధం ఉందని నిత్యం వేధిస్తున్నాడని చెప్పింది.
దీంతో ధనలక్ష్మి ఆమె బంధువులతో కలిసి కూతురు ఉమా ఇంటికి వెళ్లింది. మారిముత్తుకు వార్నింగ్ ఇచ్చి కూతురు ఉమాను ఇంటికి పిలుచుకుని వెళ్లిపోవడానికి సిద్దం అయ్యారు. నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోయి ఎలా బతుకుతున్నావో నేను చూస్తానని ఆరోజు మారిముత్తు అతని భార్య ఉమాను బెదిరించాడు. తరువాత పుట్టింటికి వెళ్లిపోయిన ఉమా మునిసిపల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది.

గత నెల 20వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో కారులో కొందరితో కలిసి వెళ్లిన మారిముత్తు అతని భార్య ఉమాను ఆమె తల్లి ముందే బలవంతంగా రోడ్డుపైకి లాక్కొని వచ్చి కారులో అపహరించాడు. ఈ విషయమై ధనలక్ష్మి తన కూతురుని ఆమె మాజీ భర్త మారిముత్తు కిడ్నాప్ చేశాడని మైలాడుతురై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును చూసిచూడట్లు వదిలేశారు.
తన కూతురు ఉమా కిడ్నాప్ అయ్యిందని ఫిర్యాదు చేసి దాదాపు నెల రోజులు కావస్తున్నా తన కూతురు గురించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ధనలక్ష్మి పుదుకోటై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో భర్త మారిముత్తుతో విడిపోయి తల్లితో కలిసి జీవిస్తున్న ఉమాను ఆమె భర్త మారిముత్తు చంపేస్తానని పంపించిన వీడియో కూడా ధనలక్ష్మి జిల్లా ఎస్పీకి ఇచ్చింది. జిల్లా ఎస్సీ స్థానిక పోలీసులను పిలిపించి చివాట్లు పెట్టి ఉమా ఎక్కడ ఉందో వారంలోపు తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కిడ్నాప్ కు గురైన కూతురు ఉమా ఎక్కడ ఉందో, కనీసం ఫోన్ కూడా చెయ్యలేదని ఆమె తల్లి ధనలక్ష్మి బోరున విలపిస్తోంది.












Click it and Unblock the Notifications