Exit Polls: అధికార పార్టీకి ఊహించని షాక్, ఓటర్లు రివర్స్ గేమ్, ఎక్కడ ఉండాలో అక్కడే !
2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక 20కి పైగా సీట్లు గెలుచుకుంటామని బీజేపీ ధీమాగా ఉంది. కర్ణాటక బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని చెబుతున్నారు. కర్ణాటకలో మాకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని, అందులో ఎలాంటి అనుమానం లేదని శనివారం బీజేపీ సీనియర్ నాయకులు చెప్పారు. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావడంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ తిన్నారు.
కర్ణాటకలో 28 పార్లమెంట్ నియోజక వర్గాలు ఉన్నాయి. జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ లోక్ సభ ఎన్నికల బరిలో దిగింది. కర్ణాటకలో 25 లోక్ సభ నియోజక వర్గాల్లో బీజేపీ పోటీ చేసింది. ఎన్డీఏ భాగస్వామి అయిన జేడీఎస్ కు మూడు సీట్లు ఇచ్చింది. ఇక కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 28 లోక్ సభ నియోజక వర్గాల్లో పోటీ చేసింది. ఉచిత హామీ పథకాలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో 20కి పైగా ఎంపీ సీట్లలో విజయం సాధిస్తామని ధీమాగా ఉంది.

ఇక సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి లోక్ సభ ఎన్నికల ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం నానా తంటాలుపడ్డారు. అయితే శనివారం సాయంత్రం విడుదల అయిన పలు సర్వేలు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయి. కర్ణాటకలో బీజేపీ అత్యదిక సీట్లు కైవసం చేసుకుంటుందని అనేక సర్వేలు చెప్పాయి.
మెజారిటీ సర్వేలు బీజేపీకి అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ అయ్యారు. అయితే తాము రెండు అంకెల సంఖ్యలో ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటామని, ఇలాంటి సర్వేల మీద మాకు నమ్మకం లేదని సీఎం సిద్దరామయ్య, డీకే శికుమార్ వేర్వేరుగా మీడియాకు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేలను పొగిడిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే సర్వేలను ఎందుకు నమ్మడం లేదని బీజేపీ నాయకులు ప్రశ్నించారు.

మీరు సర్వేలను నమ్మడం కాదు, మిమ్మల్ని ప్రజలు నమ్మడం లేదని, జూన్ 4వ తేదీన మీ భాగోతం బయటపడుతుందని బీజేపీ నాయకులు కర్ణాటకలోని కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తున్నారు. మొత్తం మీద మెజారిటీ సర్వేలు కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని చెప్పడంతో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ సర్వే ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications