బెంగళూరు కల్చర్ గురించి ఈ రష్యన్ యువతీ భలే చెప్పిందిగా
బెంగళూరులో నివసిస్తోన్న ఓ రష్యన్ ఉద్యోగిని.. భారత్ లో వర్క్ కల్చర్ గురించి తన అనుభవాలను పంచుకున్నారు. దీనిపై ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. 12 సంవత్సరాలుగా భారత్ లో పని చేస్తోన్నారామె. విధి నిర్వహణలో భాగంగా బెంగళూరు సహా వివిధ నగరాల్లో నివసించారు. ప్రస్తుతం సిలికాన్ సిటీలో సెటిల్ అయ్యారు. ఈ 12 ఏళ్లకాలంలో ఆయా నగరాల్లో ఎదురైన అనుభవాలు, తోటి ఉద్యోగులు, ఇక్కడి వర్క్ కల్చర్ గురించి తెలియజేశారు.
ఆమె పేరు యూలియా అస్లమోవా. విదేశాల్లో కనిపించని భిన్నమైన సంస్కృతి ఒక్క భారత్ లోనే చూడగలిగానని చెప్పారు. ఇక్కడి ఆఫీస్ వర్క్ కల్చర్ కూడా వైవిధ్యంతో ఉంటుందని అన్నారు. ఇక్కడ కనిపించే ప్రత్యేకమైన ఆచారాలు, ఉద్యోగుల మధ్య ఏర్పడే బలమైన బంధాలను ఆమె తన పోస్ట్‌లో పూసగుచ్చినట్లు వివరించారు.

అత్యాధునిక ఐటీ రంగంలో కూడా ఇక్కడి ఉద్యోగులు అనుసరించే కొన్ని అలవాట్లు, సంప్రదాయాలు తనకు ఎంతగానో నచ్చాయని యూలియా పేర్కొన్నారు. కెరీర్ ప్రారంభంలో- తోటి ఉద్యోగులు తన ఆహారపు అలవాట్లు టీ/కాఫీ గురించి అడిగి తెలుసుకోవడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. మేనేజర్లు, అంతకంటే టాప్ క్యాడర్ ఉద్యోగులు కూడా ఆఫీస్ లో ఎక్కువ సేపు గడపడం.. ఇతర దేశాల్లో లేదని అన్నారు. రాత్రి 11 గంటలకు కాల్స్, మెయిల్స్ రావడం వంటివి ఇక్కడ సాధారణమని చెప్పారు.
ఆఫీస్ కు వచ్చే విషయంలో ట్రాఫిక్ ఇబ్బందులను తీవ్రమైనవిగా పరిగణిస్తుంటారని, ఈ విషయాన్ని మెజారిటీ ఉద్యోగులు తనతో చెప్పారని యూలియా తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరితే ఆఫీస్ కు చేరుకోవడానికి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుందని అన్నారు. అలాగే- ఇక్కడి ఉద్యోగుల్లో ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ అని, ఏదైనా అడిగితే నో చెప్పడానికి ఇష్టపడరని ఆమె అన్నారు.
వినాయక చవితి వంటి పండుగలను ఆఫీస్ లో అందరితో కలిసి జరుపుకోవడం ఇక్కడి ఓ ప్రత్యేకతగా వివరించారు యూలియా. విధి నిర్వహణలో భాగంగా ఎక్కువ సమయాన్ని సహోద్యోగులతో గడుపుతుంటామని, పూజల వంటివి కలిసి జరుపుకోవడం చాలా అర్థవంతంగా ఉంటుందని అన్నారు. అలాంటి సందర్భాల్లో ఉద్యోగులు కుటుంబ సభ్యుల్లా కలిసిపోతుంటారని పేర్కొన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతీ యువకులు.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పట్ల ఎంతో కేరింగ్ గా ఉంటారని, వారి మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉంటుందని అన్నారు. ఇది విదేశాల్లో అంతగా కనిపించదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఉద్యోగ రీత్యా భారత్ లో ఇప్పటివరకు తాను నాలుగు నగరాల్లో నివసించానని, అన్నింటికంటే బెంగళూరు ది బెస్ట్ అని కితాబిచ్చారు యూలియా. భారత్ లో స్థిరపడాల్సి వస్తే తన ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాయిస్ ఒక్క బెంగళూరు మాత్రమేనని అన్నారు. "నమ్మ బెంగళూరు.. ది బెస్ట్" అని అన్నారు. ఢిల్లీ, జైపూర్, చెన్నై, ముంబై కంటే బెంగళూరులో వాతావరణం బ్యాలెన్స్డ్ గా ఉంటుందని చెప్పారు.
ఇక్కడి వాతావరణం చాలా అందంగా ఉంటుందని అన్నారు. ఈ నాలుగు సిటీలు కూడా చలికాలంలో చాలా చల్లగా, ఎండాకాలంలో అత్యంత వేడిగా ఉంటాయని, బెంగళూరు మాత్రం బ్యాలెన్స్డ్ గా ఉంటుందని చెప్పారు. శీతాకాలంలో చలి, వేసవిలో ఎండ తీవ్రత సాధారణంగానే ఉంటుందని, ఆమె పేర్కొన్నారు. పదేళ్ల కిందట బెంగళూరులో ఎయిర్ కండిషన్లు చాలా అరుదుగా అవసరం అయ్యేవని, ఇప్పుడు అవి దాదాపుగా తప్పనిసరిగా మారాయని చెప్పారు.












Click it and Unblock the Notifications