ఎక్స్‌ప్రెస్ రైలు గుద్దిన గద్దుడుకు: చెబితే వినరుగా: చెల్లాచెదురుగా (వీడియో)
పట్టాలు దాటుతున్న ఓ భారీ లారీని ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొట్టిన ఉదంతం ఇది. దీని దెబ్బకు లారీ మొత్తం ఓ పక్కుకు ఒరిగిపోయింది. వాహనదారులపై పడింది. అదృష్టం కొద్దీ భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కొందరు వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు గానీ.. అనేక ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ రెండింటి మధ్య నలిగిపోయాయి. రైలు ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.
జార్ఖండ్‌లోని దియోఘర్ జిల్లాలో ఈ ఘటన సంభవించింది. జిల్లాలోని నవాడి రైల్వే క్రాసింగ్ వద్ద గురువారం సాయంత్రం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఒకవంక గోండా-అసన్‌సోల్ ఎక్స్‌ప్రెస్ వస్తోన్నప్పటికీ.. రైల్వే క్రాసింగ్ వద్ద భారీగా వాహనాలు కనిపించాయి. ఓ లారీ సహా, పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనదారులు పట్టాలు దాటడానికి ప్రయత్నించారు. లారీ పట్టాలపైనే చిక్కుకుపోయింది. గేట్ తెరిచే ఉన్నప్పటికీ.. ముందుు కదల్లేకపోయింది. పట్టాలపైనే స్తంభించింది.

దీంతో గోండా-అసన్‌సోల్ ఎక్స్‌ప్రెస్ నేరుగా లారీని ఢీ కొట్టింది. లారీ నిలిచిపోయిన విషయాన్ని గుర్తించిన లోకో పైలెట్.. బ్రేక్ అప్లై చేశారు గానీ అది సాధ్యపడలేదు. రైలు వేగం మందగించిందే తప్ప ఆగలేదు. పట్టాలపై ఇరుక్కుపోయిన లారీ ఢీ కొట్టింది. కొంతదూరం లాక్కెళ్లింది. రైలు ఢీ కొట్టిన వెంటనే లారీ కుడిపక్కకు కొంత ఒరిగిపోయింది. దాని పక్కన ఉన్న వాహనదారులు గాయపడ్డారు. ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమాదంతో జసిదిహ్-అసన్‌సోల్ ప్రధాన మార్గంలో రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అసన్‌సోల్ రైల్వే డివిజన్ ప్రతినిధి ప్రకారం, ప్రమాదంపై దర్యాప్తు మొదలైంది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, రైళ్ల రాకపోకలు రెండు గంటల తర్వాత సాధారణ స్థితికి వచ్చాయని రైల్వే అధికారులు వెల్లడించారు. రైలింజన్ కొంత దెబ్బతిందని తెలిపారు.












Click it and Unblock the Notifications