జాక్వెలిన్ ఫెర్నాడెజ్‌ను ముంబై విమానాశ్రయంలో అడ్డుకున్న అధికారులు: లుకౌట్ ఎఫెక్ట్
ముంబై: మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారత్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముంబై విమానాశ్రయం చేరుకున్న జాక్వెలిన్ ను అక్కడి అధికారులు అడ్డుకున్నారు. మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలోనే జాక్వెలిన్ ను విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే, జాక్వెలిన్ ను మాత్రం అరెస్డ్ చేయలేదని తెలిసింది. కాసేపు విచారణ చేసిన తర్వాత జాక్వెలిన్ ను తిరిగి ముంబై వీడి వెళ్లేందుకు అనుమతిచ్చినట్లు సమాచారం.

కాగా, రూ. 200 కోట్లకు సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసు విచారిస్తోన్న ఈడీ.. ప్రధాన నిందితుడిగా సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి పేరును ఛార్జీషీటులో స్పష్టం చేసింది. ఇందులో బాలీవుడ్ నటి, శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తోపాటు నోరా ఫతే పేర్లను కూడా చేర్చింది. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఇప్పటికే ఈడీ పలుమార్లు విచారించింది.
రూ. 10 కోట్ల విలువైన బహుమతులు తీసుకున్న ఆరోపణలపై జాక్వెలిన్ కు ఇటీవల మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈడీ అధికారులు ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే జాక్వెలిన్ ను అధికారులు ముంబై విమానాశ్రయంలో అడ్డుకున్నారు.