ఆ పాపాలను మర్చిపోవాలనే: యూపీఏ కూటమి పేరు మార్చడంపై మోడీ
జైపూర్: విపక్షాల కూటమి 'ఇండియా'పై తీవ్రస్థాయి స్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలోని సామాన్య ప్రజల కలలు నెరవేరుతున్నాయనే ప్రతిపక్షాలు ఆగ్రహిస్తున్నాయని అన్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా విపక్ష కూటమిపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. ప్రజలను అభివృద్ధికి ఆమడ దూరం ఉంచినవారు, వారి ఆకాంక్షలు, ఆశలను పట్టించుకోనివారు నేడు ప్రజల కలలు సాకారమవుతుంటే చూసి ఆగ్రహిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని అందుపులో ఉంచేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని.. అలా చేసి ఉండకపోతే నిత్యావసర ధరలు మరింతగా పెరిగేవన్నారు.

అవినీతి, వారసత్వంతో కూడిన ఆ కూటమి పేరు మార్చుకుందే తప్ప ఆ ముఖాలు పాతవేనన్నారు. వారు చేసిన పాపాలు, అలవాట్లు అలాగే ఉన్నాయన్నారు. ఆ గ్రూపు పద్ధతులు, ఉద్దేశాలు ఒకేలా ఉంటాయన్నారు. అవన్నింటినీ మర్చిపోవాలనే.. కూటమి పేరును మార్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను అధికారంలోకి రానీయకుండా నిలువరించేందుకు 26 విపక్ష పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిని ఉద్దేశించి ప్రధాని మోడీ ఈ విమర్శలు చేశారు.
ఇంతకుముందు ప్రభుత్వం కొనసాగితే ప్రజలు నెలకు మొబైల్ ఫోన్ బిల్లు రూ. 6000 చొప్పున చెల్లించాల్సి వచ్చేదన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలో ఒకటన్నారు. డిజిటల్ ఇండియాతో సామాన్యుల సమస్యలన్నింటినీ పరిష్కరించామన్నారు.
కాగా, 1,405 కోట్ల రూపాయలతో నిర్మించిన గుజరాత్‌లోని మొదటి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని రాజ్‌కోట్ నగరం సమీపంలో గురువారం ప్రధాని మోడీ ప్రారంభించారు. రాజ్‌కోట్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరాసర్ గ్రామంలో ఈ సౌకర్యం 1,025.50 హెక్టార్లలో (2,534 ఎకరాలు) విస్తరించి ఉంది, ఇందులో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 1,500 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని నిర్మించిందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఇక్కడ 14 విమానాలను ఏ పాయింట్ వద్దనైనా పార్క్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications