Ayodhya Verdict: ఇట్స్ యునానిమస్ వెర్డిక్ట్.. తీర్పు ఆరంభించిన చీఫ్ జస్టిస్: కోర్టు హాలు కిటకిట.. !
న్యూఢిల్లీ: ఇట్స్ యునానిమస్ వెర్డిక్ట్.. అంటూ అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై తన తీర్పు పాఠాన్ని చదవడం ఆరంభించారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్. శనివారం ఉదయం 10 గంటల సమయంలో సుప్రీంకోర్టుకు చేరుకున్న ఆయన సరిగ్గా 10:30 గంటలకు తీర్పును ఆరంభించారు. సుప్రీంకోర్టు భవన సముదాయంలోనొ ఒకటో నంబర్ హాలులో తీర్పు ఆరంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు న్యాయవాదులు, కక్షిదారులతో న్యాయస్థానం క్రిక్కిరిసి పోయింది. సీల్డ్ కవర్ లో తీర్పు పాఠాన్ని తీసుకొచ్చారు. దాన్ని చదవడం ఆరంభించారు.

గంటలో ముగించేస్తా..
తీర్పు పాఠాన్ని చదవడాన్ని ఆరంభించడానికి ముందు రంజన్ గొగొయ్ కొద్దిసేపు మాట్లాడారు. తీర్పు పాఠాన్ని చదవడాన్ని అర్థగంట నుంచి గంట సమయం పడుతుందని అన్నారు. గంటలోగా తీర్పు పాఠాన్ని వినిపిస్తానని అన్నారు. సున్నీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ ను తిరస్కరించినట్లు చెప్పారు. కోట్లాదిమంది ప్రజల మనోభావాలను న్యాయస్థానం అర్థం చేసుకుందని, ఆచార వ్యవహారాలను బలంగా విశ్వసిస్తోందని అన్నారు. అనంతరం తీర్పును చదవడాన్ని ఆరంభించారు. అయోధ్యలో రామజన్మభూమి ప్రదేశాన్ని హిందువులు ఎంత బలంగా విశ్వసిస్తున్నారో.. ముస్లింలు కూడా బాబ్రీ మసీదు ప్రాంతాన్ని అంతే బలంగా నమ్ముతున్నారని అన్నారు.

నజుల్ భూమి అనడంలో సందేహాలు లేవు..
రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు సంబంధించిన 2.77 ఎకరాల స్థలం నజుల్ భూమి అనడంలో ఎలాంటి సందేహాలు లేవని పేర్కొన్నారు. ఈ ప్రదేశాన్ని హిందువులు, ముస్లిం భక్తులు తమ పుణ్యక్షేత్రంగా భావిస్తున్నారని అన్నారు. ఈ ప్రదేశంలోనే శ్రీరామచంద్రుడు జన్మించాడని కోట్లాదిమంది హిందువులు బలంగా విశ్వసిస్తున్నారని, వారి విశ్వాసాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించారు. వివాదాస్పద ప్రదేశం ఇస్లామిక్ కట్టడం కాదని, ఆలయ నిర్మాణానికి సంబంధించినదని సాక్ష్యాధారాల వల్ల భావిస్తున్నామని చెప్పారు.

అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడనటానికి..
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధారాలు దీన్ని నిర్ధారించట్లేదని అన్నారు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదును నిర్మించలేదని, మసీదును నిర్మించిన ప్రదేశం అంతకుముందు ఖాళీగా ఉండేదనడానికి సాక్ష్యాధారాలు లేవని అన్నారు. దాని కింద ఆలయ నిర్మాణాలు ఉన్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. అయోధ్యలోనే శ్రీరామచంద్రుడు జన్మించాడనటానికి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు చారిత్రాత్మకమైనవిగా గుర్తించామని రంజన్ గొగొయ్ చెప్పారు. శ్రీరాముడు జన్మించిన, నడయాడిన ప్రదేశంగా భావించే ఆధారాలు ఉన్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications