వైఎస్సార్‌ను గుర్తు చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో: రైతులపై వరాలజల్లు: ఆ రెండూ
లక్నో:అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు ఆరంభం కానుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో తొలివిడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం పోలింగ్ మొదలు కానుంది. ఏడు దశల్లో మార్చి 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కోట్లాదిమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోనున్నారు. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

యూపీలోనే తొలి విడత
ఉత్తర ప్రదేశ్‌లో మాత్రమే తొలిదశ పోలింగ్ జరుగనుంది. షామ్లీ, ముజప్ఫర్ నగర్, మీరఠ్, బాగ్‌పట్, ఘజియాబాద్, హాపుర్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. 58 నియోజకవర్గాల పరిధిలో 2.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 500 మందికి పైగా వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఒంటరి పోరు..
ఉత్తర ప్రదేశ్‌లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. ప్రతిపక్ష స్థానం కాదు కదా.. చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లను కూడా సాధించుకోలేకపోయింది. 403 స్థానాలు ఉన్న యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఉన్న సభ్యుల సంఖ్య మూడు. ఈ దఫా గట్టిపోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సమాయాత్తమైంది. ఒంటరిగా ఎన్నికల బరిలో దిగింది. పార్టీ తరుఫుముక్క ప్రియాంకా గాంధీ వాద్రాకు ఎన్నికల నిర్వహణ బాధ్యతను అప్పగించింది.

బీజేపీని దెబ్బకొట్టినా చాలు..
బీజేపీ విజయావకాశాలను దెబ్బకొట్టినా చాలనే అభిప్రాయం ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమౌతోంది. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతే.. దాని ప్రభావం 2024 నాటి లోక్‌సభ ఎన్నికలపై పడుతుందనేది కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 80 లోక్‌సభ స్థానాలను కలిగి ఉన్న ఉత్తర ప్రదేశ్‌పై బీజేపీ పట్టును సడలించగలిగితే- 2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని, ప్రత్యామ్నాయంగా తాము ఎదగడానికి ఇది సహకరిస్తుందనేది కాంగ్రెస్ వ్యూహం.

కీలకంగా మారిన మేనిఫెస్టో..
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ- తన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. ఉన్నతి విధాన్ జన ఘోషణ్ పత్ర 2022గా పేరు పెట్టింది. కీలక రంగాలపై వరాల జల్లును కురిపించింది. రైతాంగానికి భారీగా తాయిలాలను ఇచ్చింది. ఈ మేనిఫెస్టోను కొద్దిసేపటి కిందటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్‌ఛార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా విడుదల చేశారు. ఇందులో పొందుపరిచిన కొన్ని హామీలు.. ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేశాయి.

రైతులపై..
కాంగ్రెస్ రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించిందీ మేనిఫెస్టోలో. తాము అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రియాంకా గాంధీ వాద్రా హామీ ఇచ్చారు. అలాగే- రైతుల విద్యుత్ బకాయిలను కూడా మాఫీ చేస్తామని చెప్పారు. ఉమ్మడి ఏపీలో ఈ రెండూ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ విద్యుత్ బిల్లులను వైఎస్సార్ మాఫీ చేశారు. వారి బకాయిలను రద్దు చేశారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారు.

20 లక్షల ఉద్యోగాలు..
అలాగే- తాము అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామని, దాని ప్రకారం నియామకాలు చేపడతామని చెప్పారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఉచిత విద్యను అందంచడంతో పాటు పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్‌షిప్‌లు ఇస్తామని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల మరణించిన వారి కుటుంబానికి 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక పరిహారాన్ని చెల్లిస్తామని అన్నారు. స్కూల్ ఫీజులను నియంత్రిస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications