ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు పెద్ద సవాల్.. ఎదుర్కొనేందుకు ప్లాన్ రెడీ... కొత్త స్ట్రాటజీతో ముందుకు...
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత 80 రోజులకు పైగా ఆందోళనలు చేపడుతున్న రైతులకు ఇప్పుడో పెద్ద సవాల్ ఎదురైంది. రానున్నది ఖరీఫ్ సీజన్ కావడంతో... చాలామంది రైతులు సేద్యం కోసం గ్రామాల బాట పట్టాలని భావిస్తున్నారు. అయితే భారీ సంఖ్యలో రైతులు నిరసన ప్రదేశాల నుంచి తరలిపోతే ఉద్యమం బలహీనపడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు దీనికో ప్రత్యామ్నాయం ఆలోచించాయి. ప్రతీ గ్రామానికి చెందిన 15 మంది రైతులు ఆందోళనల్లో పాల్గొనేలా... మిగతావారు వ్యవసాయ పనుల కోసం గ్రామాలకు వెళ్లేలా ప్లాన్ రెడీ చేశాయి.

రొటేషన్ పద్దతిలో...
రొటేషనల్ పద్దతిలో ఈ ప్లాన్‌ను అమలుచేయనున్నారు. అంటే,ఒక్కో గ్రామానికి 15 మంది చొప్పున కొంతకాలం పాటు గ్రామాలకు వెళ్లి వ్యవసాయ పనులు చక్కపెట్టుకుని తిరిగి రావాల్సి ఉంటుంది. రైతు సంఘం నేత గుర్మీత్ సింగ్ దీనిపై మాట్లాడుతూ... 'నిరసన ప్రదేశంలో 4000-5000కి మించి జనం అవసరం లేదని నిర్ణయించాం. అయితే జనవరి 28 తరహాలో ప్రభుత్వం మరోసారి ఆందోళనకారులను ఖాళీ చేయించే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి రైతులు ఎలాంటి పిలుపుకైనా సిద్దంగా ఉండాలని చెప్పాం.కేవలం గంట వ్యవధిలో సమీప ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులను మేము నిరసన ప్రదేశాలకు తరలించగలం.ఒక అంచనా ప్రకారం 24గంటల వ్యవధిలో లక్ష మంది రైతులను తరలించగల సత్తా మాకుంది.' అని పేర్కొన్నారు.

గ్రామాలకు వెళ్లక తప్పని పరిస్థితి...
పంటల సీజన్ అంటే రైతులకు ఒక పండుగ వాతావరణం లాంటిది. కానీ ఈసారి వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న నేపథ్యంలో.. ఢిల్లీ బోర్డర్స్‌లో ఆందోళనల్లో పాల్గొంటున్న చాలామంది రైతుల్లో ఒక సందిగ్ధం నెలకొంది. గ్రామాలకు వెళ్లి వ్యవసాయం చేయడమా.. లేక ఇక్కడే ఉండి పోరాటం కొనసాగించడమా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో పండించే చెరుకు పంటలకు పెద్ద సంఖ్యలో వ్యవసాయ కూలీల అవసరం ఉంటుంది. సుగర్ మిల్స్ కూడా ఏప్రిల్ చివరి వారం వరకే తెరిచి ఉంటాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా తమ గ్రామాలకు కదలాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొత్త స్ట్రాటజీలో భాగం....
రైతులు గ్రామాలకు తరలాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడటంతో తక్కువమందితోనైనా సరే ఆందోళనలను కొనసాగించాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి. ఇది తమ కొత్త స్ట్రాటజీలో భాగమేనని చెప్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతీ గ్రామం నుంచి 15 మంది రైతులు మాత్రమే నిరసన ప్రదేశంలో ఉండేలా... మిగతావారు గ్రామాలకు వెళ్లేలా ప్లాన్ రెడీ చేసినట్లు బీకేయూ ప్రెసిడెంట్ నరేష్ టికాయిత్ వెల్లడించారు. ఒక్కో వారం 15 మంది చొప్పున వారి గ్రామాలకు వెళ్తారని... వారం రోజుల్లో తిరిగి నిరసన ప్రదేశాలకు వస్తారని తెలిపారు.

ఉద్యమాన్ని మరింత వ్యాప్తి చేసే వ్యూహం...
ఇప్పటివరకూ రైతు ఉద్యమంలో భాగస్వాములు కాని రైతులను కూడా ఇందులోకి తీసుకొచ్చేందుకు రైతు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు గ్రామాల్లోకి వెళ్లే రైతులకు రైతు ఉద్యమానికి సంబంధించిన బుక్‌లెట్లు ఇచ్చి పంపించనున్నారు. క్షేత్రస్థాయిలో వాటిని సర్క్యులేట్ చేయడం ద్వారా ఉద్యమానికి దూరంగా ఉన్నవారిని కూడా ఇందులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండును పట్టించుకోవట్లేదు కాబట్టి తమ ఆందోళనలు ఎప్పటివరకైనా కొనసాగుతాయని చెబుతున్నారు.