నేడు రైతు అమరవీరులకు నివాళి - 25 రోజుల్లో 33 మంది మృతి -కండిషన్‌కు సరేనంటేనే చర్చలు
సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలు ఆదివారం నాటికి 25వ రోజుకు చేరాయి. బక్క రైతుకు శాపంగా, బడా కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే ఏకైక డిమాండ్‌తో ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో..
నవంబర్ చివరి వారంలో చలో ఢిల్లీ పిలుపునిచ్చిన తర్వాత.. గడిచిన 25 రోజుల్లో ఏకంగా 33 మంది రైతులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. వారిని అమరవీరులుగా గుర్తిస్తూ ఆదివారం నాడు 'రైతు అమరవీరుల దినోత్సవం'గా జరపాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా గ్రామాల్లో రైతు అమరవీరులకు నివాళులు అమర్పించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

చలి పంజా విసరడంతో ఢిల్లీ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయినా.. అన్ని వయసుల రైతుల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తున్నదని రైతు సంగాల నేతలు విమర్శించారు. రైతుల నిరసనల వెనుక రాజకీయ కుట్ర దాగుందన్న ప్రధాని నరేంద్రమోదీ, వ్యవసాయ మంత్రి తోమర్ ల కామెంట్లను ఖండిస్తూ రైతులు బహిరంగ లేఖలు రాశారు.
రైతు అమరుల సాక్షిగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలు కొనసాగిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి. చర్చల విషయంలో కేంద్రం రోజుకో తీరుగా వ్యవహరిస్తున్నది. తాజాగా హర్యానా సీఎం ఖట్టర్ కూడా రైతులతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, రైతుల ఎస్ ఆర్ నో (అటో ఇటో తేల్చుకోవాలని కేంద్రానికి ఇచ్చిన అల్టిమేటం) విషయంలో కాస్త వెనక్కి తగ్గాలని, చట్టాలను మొత్తానికే వెనక్కి తీసుకోవడం కుదరదు కాబట్టి, ఇతర పరిష్కార మార్గాలపై చర్చలకు రైతులు అంగీకరించాలని ఖట్టర్ అన్నారు.












Click it and Unblock the Notifications