కరుడుగట్టిన లష్కరే తొయిబా ఉగ్రవాది అబు దుజానా హతం
శ్రీనగర్: మరో కరుడుగట్టిన లష్కరే తొయిబా ఉగ్రవాదిని మట్టుబెట్టాయి మన భద్రతా దళాలు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతాసిబ్బంది జరిపిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ అబు దుజానా హతమయ్యాడు.
పుల్వామాలోని హక్రీపోరా గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతాసిబ్బంది ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టారు.
తనిఖీలు నిర్వహిస్తుండగా.. ముష్కరులు జవాన్లపైకి కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపి ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు.

ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని జమ్మూకాశ్మీర్ డీజీపీ ఎస్‌పీ వేద్ అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన అబు దుజానా.. కాశ్మీర్‌లోని లష్కరే తోయిబా కార్యకలాపాలకు చీఫ్‌గా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన దుజానాపై రూ. 10లక్షల రివార్డు కూడా ఉంది.
ఇప్పటికే 20సార్లు భద్రతా దళాల నుంచి తప్పించుకున్న దుజానా.. ఎట్టకేలకు హతమవడంతో భారత సైన్యం భారీ విజయాన్ని సాధించినట్లయింది. అయితే భార్య కోసం వచ్చిన అతడు భద్రతా దళాలపై కాల్పులతో విరుచుకుపడినట్లు తెలిసింది. దీంతో సైన్యం ఎదురుకాల్పులు జరిపింది.












Click it and Unblock the Notifications