వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెరియర్ ప్లానింగ్ లాగా ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా అవసరమే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కెరీర్ ప్లానింగ్ లాగ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా అవసరమే

ప్రపంచీకరణ వల్ల గత మూడు దశాబ్దాలలో మన దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే అటు దైనందిన జీవనంలో, ఇటు ఆలోచనా ధోరణిలో అప్పటి తరానికి ఇప్పటి తరానికి గల తేడా ప్రస్పుటంగా కనిపిస్తుంది.

రిటైర్ అయ్యాక ప్రావిడెంట్ ఫండ్ డబ్బుతో ఒక ఇల్లు కొనుక్కుని పెన్షన్ మీద భరోసాతో ఉండే ఆ తరానికి, ఐదు పదుల వయసు దాటకముందే రిటైర్ అయి ప్రపంచ యాత్రలు చేయాలని ఆలోచించే ఈ తరానికి మధ్య సారుప్యత పెద్దగా కనిపించదు.

పిల్లల స్కూల్ ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు విపరీతంగా పెరిగిన ప్రస్తుత కాలంలో ఆర్థిక స్వావలంబనకు అర్థం కూడా మారిపోయింది. ఇలాంటి తరుణంలో కెరియర్ ప్లానింగ్ లాగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే ఒక నిర్థిష్టమైన వ్యక్తిగత ప్రణాళిక చాలా అవసరం.

ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశాలను స్థూలంగా మూడు భాగాలుగా విభజించవచ్చు.

  • జీవిత బీమా (టర్మ్ పాలసీ)
  • ఆరోగ్య బీమా (హెల్త్ పాలసీ)
  • మదుపు (ఇన్వెస్ట్మెంట్)

జీవిత బీమా

గత పది పదిహేనేళ్ళల్లో వచ్చిన విప్లవాత్మక మార్పుల్లో టర్మ్ పాలసీ ఒకటి. 2005 ప్రాంతాలలో కూడా టర్మ్ పాలసీ తీసుకోవాలంటే చాలా శ్రమతో కూడిన ప్రహసనం.

కానీ, ప్రస్తుతం కేవలం రెండు, మూడు పని దినాలలో చాలా సులభంగా టర్మ్ పాలసీ దొరుకుతోంది. మొదట్లో ఉద్యోగికి మాత్రమే ఇచ్చిన టర్మ్ పాలసీని ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఉద్యోగి జీవిత భాగస్వామికి కూడా ఇస్తున్నాయి.

ఏదైనా దురదృష్టకర సంఘటనలో ఉద్యోగి తన కుటుంబానికి దూరమైతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం టర్మ్ పాలసీ ప్రధాన ఉద్దేశ్యం.

విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగి కుటుంబం తమ జీవన ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా ఉండటానికి టర్మ్ పాలసీ ఉపయోగపడుతుంది.

ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైనా రెండో ఆలోచన లేకుండా చేయాల్సిన పని టర్మ్ పాలసీ తీసుకోవడం.

ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ముప్పైకి తక్కువ వయసున్న ఉద్యోగులకు టర్మ్ పాలసీ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ప్రీమియంలో పెరుగుదల గణనీయంగా ఉంటుంది.

అలానే నలభై ఏళ్ళ వయసు దాటాక టర్మ్ పాలసీ దొరకడం కూడా అంత సులభం కాదు. టర్మ్ పాలసీ మొత్తం ఎంత ఉండాలి అనే విషయం మీద చాలా సిద్దాంతాలు ఉన్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన పాలసీ తీసుకోవచ్చు.

వైద్యం చేస్తున్న యువతి

ఆరోగ్య బీమా

మెట్రో నగరాల్లోనే కాక చిన్న పట్టణాలలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు బాగా గిరాకీ పెరిగింది. వీటి ద్వారా నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తున్నా పేషెంట్ల బిల్ కూడా ఎక్కువగానే ఉంటోంది.

మెటర్నిటీ మొదలు, పీడియాట్రీ, రూట్ కెనాల్ లాంటి చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా అధికంగా ఉంటున్నాయి. ఈ ఖర్చులన్నీ నెల జీతం మీద భారం కాకుండా ఉద్యోగిని రక్షించడం హెల్త్ పాలసీ లక్ష్యం.

టర్మ్ పాలసీ లాగే హెల్త్ పాలసీ కూడా చిన్న వయసులో తీసుకుంటే తక్కవ ప్రీమియం ఉంటుంది.

హెల్త్ పాలసీలో ఉన్న మరొక ముఖ్య విషయం ఏమంటే కొత్త పాలసీ తీసుకోవడం కంటే, అంతకు ముందే ఉన్న పాలసీలోకి కుటుంబ సభ్యులను చేర్చడం తక్కువ ఖర్చుతో కూడిన పని.

భార్యాభర్తలు, పిల్లలున్న కుటుంబానికి ఇప్పుడు కొత్త పాలసీ తీసుకోవడం కంటే వాళ్ళల్లో ఒకరికి కొన్నేళ్ళుగా ఉన్న పాలసీలోకి జీవిత భాగస్వామిని, పిల్లలను చేర్చడం చవక.

saving

మదుపు

రేపటి అవసరాన్ని గుర్తించి దానికి తగ్గట్టు జాగ్రత్త పడటం మన సంస్కృతిలో భాగంగా వస్తోంది. ఇంటికి తెచ్చిన ధాన్యంతో గాదెలను నింపి అవసరానికి వాడుకోవడం మన ఆనవాయితీ.

అదే స్పూర్తితో భవిష్యత్ అవసరాల కోసం డబ్బు మదుపు చేయడం మన ఆర్థిక స్వావలంబనకు చాలా ముఖ్యం. నెల జీతం మీద ఆధారపడే ఉద్యోగులకు మదుపు చేసే మార్గాలు అనేకం. వాటిలో ముఖ్యమైనవి చూద్దాం.

ప్రావిడెంట్ ఫండ్

ప్రతీ నెల జీతంతో పాటూ జమ అయ్యే ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగి దీర్ఘకాలిక అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది.

ఉద్యోగి తరఫున జమ అయ్యే ప్రావిడెంట్ ఫండ్ (ఈపీయఫ్) వార్షిక మొత్తం రెండున్నర లక్షలు దాటితే దాని మీద టాక్స్ కట్టాలనే నియమం కొత్తగా వచ్చింది.

ఈ నియమాన్ని పరిగణలోకి తీసుకున్నా, ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగికి చాలా మంచి అవకాశం. ఉద్యోగి చేతిలోకి రాకుండా నేరుగా జమ కావడం వల్ల ప్రత్యేకంగా మదుపు చేయాల్సిన అవసరం లేకుండా తన భవిష్యత్ ఖాతాలోకి జమ అవుతుంది.

ఇలా జమ అయ్యే భవిష్యత్ నిధి కొన్ని ప్రత్యేక అవసరాలకు మాత్రమే వాడుకోగలరు. ఆ విధంగా దీర్ఘకాలిక అవసరాలకు, ఎమర్జెన్సీలకు వాడదగ్గ లైఫ్ లైన్ ప్రావిడెంట్ ఫండ్ అనడం అతిశయోక్తి కాదు.

ప్రస్తుతం ప్రాఫిడెంట్ ఫండ్ వడ్డీ 8.5 శాతానికి దగ్గరగా ఉంది. భవిష్యత్తులో ఇది 8 శాతానికి పడిపోయే అవకాశం ఉంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫిక్సడ్ డిపాజిట్

ఒక నిర్ణీత సమయానికి మన డబ్బును బ్యాకులో ఉంచే పద్దతే ఫిక్సడ్ డిపాజిట్. గతంలో చాలా ప్రాచుర్యం పొందిన మదుపు మార్గం.

బ్యాంకు ఇచ్చే వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, ఆ వడ్డీ మీద కూడా టాక్స్ కట్టాల్సి రావడం, ఏదైనా అవసరం వచ్చి నిర్ణీత సమయం కంటే ముందే డబ్బు తీసుకోవాలంటే పెనాల్టీ కట్టాలనే నియమం ఉండటం వల్ల ప్రస్తుతం ఫిక్సడ్ డిపాజిట్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం కనిపించడం లేదు.

కానీ నిర్ణీత సమయానికి ఫలానా మొత్తం కచ్చితంగా కావాలంటే ఫిక్సడ్ డిపాజిట్ ఒక మంచి మార్గమే అవుతుంది.

మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, ఫ్యుచర్స్ అండ్ ఆప్షన్స్ ఇలా అనేక రకాలైన మదుపు మార్గాలు స్టాక్ మార్కెట్లో ఉన్నాయి

స్టాక్ మార్కెట్

బహుసా తెలుగు రాష్ట్రాలలో పెద్దగా ప్రాచుర్యం పొందని మదుపు మార్గం స్టాక్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, ఫ్యుచర్స్ అండ్ ఆప్షన్స్ ఇలా అనేక రకాలైన మదుపు మార్గాలు స్టాక్ మార్కెట్లో ఉన్నాయి.

కానీ అన్నింటి మీద ఏదో ఒక రకమైన టాక్స్ కట్టాలనే నియమం ఉండటం వల్ల మదుపు చేసే వాళ్ళు తమ అవసరాలకు అనుగుణంగా మార్గాలను ఎంచుకోవాలి.

అన్ని మదుపు మార్గాలు కూడా వేటికి అవే ప్రత్యేకమైనవి. స్టాక్ మార్కెట్ స్కాములు, మార్కెట్ పతనమైన ఉదంతాలు మనం కథలుగా వింటూ ఉంటాం. కానీ, క్రమశిక్షణతో కూడిన మదుపు చేస్తూ స్టాక్ మార్కెట్ ద్వారా తమ ఆర్థిక లక్ష్యాలను అందుకున్నవారు కూడా చాలామంది ఉన్నారు.

అమరావతి భవనాలు

రియల్ ఎస్టేట్

భూగోళం మీద 71 శాతం నీళ్లు, 29 శాతం నేల ఉన్నాయి. మనుషుల జనాభా ఎంత ఎక్కువైనా నేల మాత్రం అంతే ఉంటుంది, తద్వారా భవిష్యత్తులో భూమికి గిరాకి పెరుగుతుంది అనే సిద్దాంతం ఆధారంగా రియల్ ఎస్టేట్ రంగం నడుస్తుంది.

గతంలో రియల్ ఎస్టేట్ రంగంలో మదుపు చేసి లాభాలు అర్జించిన వారు ఎందరో ఉన్నారు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో వృధ్ధి కనిపించడం లేదు.

దీనికి తోడు ప్రస్తుత కోవిడ్ సంక్షోభం ఈ రంగాన్ని బాగా ప్రభావితం చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Financial planning is just as essential as career planning
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X