• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైనాన్షియల్ ప్లానింగ్: డబ్బు పొదుపుగా వాడుకోవడానికి ఎలాంటి మార్గాలున్నాయి, ఏ ప్రణాళికతో భవిష్యత్తు భద్రంగా ఉంటుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

మొహ్నీష్ ప్రబయి.. భారత్‌లో పెద్దగా తెలియని పేరు. కానీ ఈయన జీవితం ఒక ఆసక్తికరమైన పాఠం. ఈయన వారెన్ బఫెట్ ఏకలవ్య శిష్యుడు. బఫెట్ సిద్దాంతాలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ పదేళ్ల తర్వాత ఒక మదుపరిగా కొన్ని మిలియన్ డాలర్లు సంపాదించారు.

2007లో బఫెట్‌తో ఒక చారిటీ డిన్నర్ కోసం ఆరున్నర లక్షల డాలర్లు ఖర్చుపెట్టడం ద్వారా ఆయన వార్తల్లోకి ఎక్కారు.

మదుపరిగా ఈయన ప్రయాణం ఎంతోమందికి స్పూర్తిదాయకం. ఎందుకంటే బఫెట్ సిద్దాంతాలు లక్షల మందికి తెలుసు. కానీ వాటిని ఈయనలా ఆచరించినవారు మాత్రం చాలా కొద్దిమందే ఉన్నారు. ఇతర మదుపరులకు సాధ్యం కానిది, ఈయన సాధించారు. ఈయనే కాదు ఎంతో మంది మదుపరులు వివిధ రకాలైన ప్రణాళికలను పాటిస్తూ తమ ఆర్థిక లక్ష్యాలకు చేరుకున్నారు.

ఎలాంటి ప్లాన్‌తో ముందుకు వెళ్ళాలి అనేది కొంత అధ్యయనం ద్వారా తెలుసుకుని ఎవరికి వారు మదుపు చేయవచ్చు. లేదా ఎవరైనా ఆర్థిక సలహాదారుల సూచనలు పాటించి మదుపు చేయవచ్చు. కానీ ఆర్థిక క్రమశిక్షణ మాత్రం ఇంకొకరు చెబితే నేర్చుకునే అంశం కాదు. అలాగే క్రాష్ కోర్స్ ద్వారా వచ్చే ఒకరోజులో లేదా నెలలో అబ్బే లక్షణం కాదు. దైనందిన జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ ఒక అలవాటుగా మారడానికి ప్రత్యేకమైన పరిశ్రమ అవసరం.

2017 ఫోర్బ్స్ పత్రిక సర్వే ప్రకారం అమెరికాలో 78% వేతనజీవులు ఏ నెల సంపాదించింది ఆ నెలలోనే ఖర్చు పెడుతున్నారు. ఇదొక ప్రమాదకరమైన జీవన విధానం. ఉన్నదాంట్లో ఎంతో కొంత రేపటికి దాచుకోవడం అనేది మన సంస్కృతిలో భాగం. క్రెడిట్ ప్రాచుర్యం పొందిన ప్రస్తుత కాలంలో ఆర్థిక క్రమశిక్షణ గురించిన ప్రత్యేక శ్రద్ద ఎంతైనా అవసరం.

ముందుగా మన ప్రస్తుత ఆర్థిక క్రమశిక్షణ మన లక్ష్యాలకు అనుగుణంగా ఉందో లేదో చూసుకోవాలి. ఈ విషయంలో పూర్తి నిజాయితీగా ఉండాలి. అప్పుడే ఒక నిర్మాణాత్మకమైన ప్రణాళిక ఏర్పరచుకోగలం. మన ఆర్థిక లక్ష్యాలు ఆర్థిక క్రమశిక్షణకు నాంది.

మదపు విషయంలో వారెన్ బఫెట్ చెప్పిన సూత్రాలు ప్రపంచ ప్రసిద్ధం

జనరల్ మోటర్స్ రీసెర్చ్ విభాగం మాజీ అధ్యక్షుడు చార్లెస్ కెటరింగ్ చెప్పినట్టు సరిగ్గా వివరించినప్పుడే ఒక సమస్య సగం పూర్తి అవుతుంది. అలాగే సరిగ్గా వివరించినప్పుడే మన ఆర్థిక లక్ష్యం సగం సాధించినట్టు. అందువల్ల ముందుగా ఆర్థిక లక్ష్యాలను SMART విధానంలో వివరించాలి. ప్రతీ ఆర్థిక లక్ష్యాన్ని ఈ క్రింద ఇచ్చిన ప్రశ్నలుగా చూడాలి.

1. ఎంత మొత్తం ఉండాలి?

2. ఏ రూపంలో ఉండాలి? స్థిర చరాస్తులు లేదా నగదు

3. ఏ సమయానికి అందుబాటులో ఉండాలి? పిల్లల చదువు, మరో అవసరం లేదా రిటర్మెంట్

4. ఎంత రిస్క్ తీసుకునే వెసులుబాటు ఉంది.

ఇలా వివరించిన ఆర్థిక లక్ష్యాలే స్పూర్తిగా మన ఆర్థిక క్రమశిక్షణకు తగిన కార్యాచరణ రూపొందించుకోవాలి. మనకు అవసరం అయిన ఖర్చులు ఏవీ, అవసరం లేకున్నా వేరే కారణాల వల్ల చేస్తున్న ఖర్చులు ఏవీ, అనే స్పష్టత చాలా అవసరం. ఆర్థిక క్రమశిక్షణలో ముఖ్యమైన అంశం అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవడం లేదా అదుపులో పెట్టుకోవడం.

ప్రాధామ్యాల ఆధారంగా మదుపు చేయడం కీలకం

చెప్పడానికి చాలా సులువైన విషయం కానీ పాటించడానికి చాలా కష్టమైన అంశం. సరిగ్గా ఈ ఇబ్బంది నుంచీ బయట పడటానికి కింద ఇచ్చిన పద్దతులను పాటించాలి.

1. ప్రత్యేక మదుపు అకౌంట్:

ఈ విధానంలో నెల జీతం వచ్చిన వెంటనే మనకు ముఖ్యమైన అవసరాలకు మదుపు చేసేయాలి. చాలామంది మదుపరులు మదుపు చేయడానికి మాత్రమే ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టుకుని నెల మొదటి వారంలో ఆ అకౌంట్లో డబ్బులు వెళ్ళేలా నెట్ బ్యాంకింగ్ సూచనలు పెట్టుకుంటారు. దీని ద్వారా అనవసర ఖర్చులకు మనం మదుపు చేయాల్సిన పైకం వాడుకోకుండా ఉంటాం. వినడానికి సులభంగా ఉన్నా, మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేయగల శక్తివంతమైన విధానం ఇది.

2. పర్సెంటేజ్ విధానం:

ఈ విధానంలో మనం పెట్టే వివిధ రకాలైన ఖర్చులకు మన జీతంలో తగిన పర్సెంటేజ్ ఇవ్వాలి. అలా ఇచ్చిన పర్సెంటేజ్ దాటాక ఆ రకమైన ఖర్చు పెట్టకూడదు. ఉదాహరణకు, మన జీతంలో పది శాతం రెస్టారెంట్/సినిమా ఖర్చులు అనుకుంటే ఆ పదిశాతం దాటాక ఆ ఖర్చులు పూర్తిగా ఆపేయాలి. కొన్నిసార్లు నియంత్రించుకోవడం కష్టమైనా మెల్లగా అలవాటు చేసుకోవాలి. మన ఆర్థిక లక్ష్యాల కంటే ఇలాంటి తాత్కాలిక అవసరాలు ఎక్కువ కాదు.

3. రివర్స్ బడ్జెట్ విధానం:

ఈ విధానంలో వార్షిక లక్ష్యాలలో ప్రతీ లక్ష్యాన్ని ఒక నెలకు ఆపాదించుకోవాలి. అంటే జనవరి నెలలో బీమా ప్రీమియం చెల్లిండానికి ప్రాధాన్యత ఇస్తే ఫిబ్రవరి నెలలో పిల్లల చదువులకు సంబంధించిన మదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మార్చి నెలలో NPSకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ రకంగా చేయడం వల్ల ప్రతీ ఆర్థిక లక్ష్యం మన ప్రాధాన్యతా క్రమంలో పడిపోకుండా ఉంటుంది. ఇది చాలా సులభమైన, ప్రభావవంతమైన పద్దతి.

నిజానికి ఇది కూడా కంపెనీలు తరచుగా వాడే విధానమే. ప్రతీ త్రైమాసికానికి ఒక ముఖ్యమైన లక్ష్యం ఉంటుంది. ఒకసారి ఎక్కువ మార్కెట్ షేర్ సాధించాలంటే మరోసారి ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ సిద్దాంతాన్నే వ్యక్తిగత అవసరాలకు అన్వయించుకోవాలి.

పొదుపు సూత్రాలు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, ఆచరణ కష్టం

4. జీరో బేస్డ్ విధానం:

సాధారణంగా కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి బడ్జెట్ వాడతారు. దీని ముఖ్య ఉద్దేశ్యం ఖర్చులు తగ్గించుకోవడం. ఈ విధానంలో కంపెనీ ఖర్చు చేసే ప్రతీ పనిని అది ఎందుకు చేయాలి అనే కోణంలో విశ్లేషిస్తారు. ఇదే సూత్రం వ్యక్తిగత జీవనంలో కూడా అన్వయించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టే ప్రతీ పని ఎందుకు చేయాలో ఒకసారి పునరాలోచిస్తే ఎన్నో అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఉదాహరణకు ఓటీటీ చందా అవసరమా లేదా అనేది ప్రతీ నెల బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది.

5.ఎన్‌వలప్ విధానం:

డేవ్ రాంసే అనే అమెరికన్ ఫైనాన్షియల్ ప్లానర్ ఈ విధానాన్ని ప్రతిపాదించారు. క్రెడిట్/డెబిట్ కార్డ్ వాడకంలో ఇబ్బందులు పడుతున్నవారు ఈ విధానాన్ని పాటించవచ్చు. ఈ విధానంలో ప్రతీ ఖర్చుకు ఒక నిర్దిష్ఠమైన మొత్తం ఒక కవర్లో ఉంచాలి. ఆ కవర్లోని మొత్తం ఖర్చు అయ్యాక ఆ రకమైన ఖర్చులు ఆ నెలలో చేయకూడదు. రిటైర్మెంట్, సరదాలు, అత్యవసర నిధి ఇలా వివిధ రకాలైన ఎన్వలప్ ఉండాలనేది రాంసే ప్రతిపాదన.

6. ఖర్చుల తర్వాత మదుపు:

మన నెల వారి అవసరాలకు అయ్యే ఖర్చు ఎంతో చూసుకుని దానికి పది శాతం అదనంగా పక్కన పెట్టుకుని మిగిలిన మొత్తం మదుపు చేయాలి. ఈ పద్దతిలో కూడా మన మదుపుకు ప్రాముఖ్యత ఇస్తూ మన ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ పద్దతిలో ఉన్న రిస్క్ ఏమిటంటే కొన్నిసార్లు మన అవసరాలు ఎక్కువగా కనిపించి ఖర్చులు అధికం అయ్యే అవకాశం ఉంది.

7. టెక్నాలజీని వాడుకోవడం:

మన ఖర్చుల వివరాలు మనకు తెలిపేందుకు వివిధ రకాల మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడుకుని ఖర్చులు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. క్యాష్ బుక్, మనీ మేనేజర్, ఫిన్ ఆర్ట్ లాంటి మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Financial Planning: What are the ways to save money and with what plan is the future secure
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X