Manipur to Hyderabad: అక్కడ తప్పించుకుని ఇక్కడకు చేరింది..ఎవరీ స్టార్ షట్లర్..?
హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ ప్రస్తుతం రగులుతోంది. కొండప్రాంతాల మధ్య పచ్చగా వర్థిల్లిన ఈ అందమైన ప్రదేశం నేడు కన్నీరు పెడుతోంది. దేశానికి ఎంతో మంది మణిహారాలను అందించిన మణిపూర్ ఇప్పుడు తల్లడిల్లుతోంది. రెండు వర్గాల మధ్య పేట్రేగిన హింసతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. మణిపూర్ రాష్ట్రంలో ఉన్న అథ్లెట్లు ఒక్కొక్కరుగా ఆ రాష్ట్రాన్ని వీడి మరో రాష్ట్రంలో సెటిల్ అవుతున్నారు. అలాంటి వారిలో పదేళ్ల బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా ఉంది.
మణిపూర్ రాష్ట్రం క్రీడాకారులకు బంగారు గనిలాంటిది. ఎంతో మంది నైపుణ్యం కలిగిన క్రీడాకారులను అందించింది మణిపూర్ రాష్ట్రం. ప్రస్తుతం అక్కడ నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో క్రీడాకారుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడింది. దీంతో క్రీడాకారులంతా తమ బంగారు భవిష్యత్తు కోసం ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్నారు. తాజాగా పదేళ్ల కిమ్‌కిమ్ ఖాంగ్సాయ్ అనే బ్యాడ్మింటన్ ఛాంపియన్ మణిపూర్‌ను వదిలి తన తల్లిదండ్రులతో అస్సాంలోని దిబ్రూఘర్‌కు చేరింది. బ్యాడ్మింటనే తమ కూతురు భవిష్యత్తు అని భావించిన తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియలేదు.

తల్లి దండ్రులు ఇలా బాధపడుతుంటే విధి మాత్రం మరోలా తలచింది.హైదరాబాదులోని సుచిత్రా బ్యాడ్మింటన్ అకాడెమీ నుంచి కిమ్‌కిమ్ తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. వెంటనే తమ అకాడెమీలో తన కూతురును చేర్పించాలంటూ ఫోన్ వెళ్లింది. దీంతో తమ కూతురు భవిష్యత్తుకు మళ్లీ రెక్కలొచ్చాయన్న ఆనందంలో మునిగిపోయారు కిమ్ కిమ్ తల్లిదండ్రులు. ఫేస్‌బుక్‌లో కిమ్ కిమ్ గురించి ఓ ఆర్టికల్ చదివినట్లు సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడెమీ హెడ్ కోచ్ మరియు వ్యవస్థాపకులైన ప్రదీప్ రాజు చెప్పారు. అంతేకాదు కిమ్‌కిమ్‌కు సంబంధించి కొన్ని వీడియోలను కూడా చూసినట్లు చెప్పారు.
బ్యాడ్మింటన్‌కు దొరికిన మేలిమి బంగారం కిమ్‌కిమ్ అని ప్రశంసించారు ప్రదీప్ రాజు. ఆమెకు సహజంగానే బ్యాడ్మింటన్ అబ్బిందని చెప్పుకొచ్చారు. కిమ్ కిమ్ ఫుట్ వర్క్, స్ట్రోక్ ప్లేకి ఫిదా అయినట్లు కోచ్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే అకాడెమీలో ప్రస్తుతం శిక్షణ పొందుతోంది స్టార్ షట్లర్ పీవీ సింధు. ఇక త్వరలో సింధుతో కలిసి ఈ పదేళ్ల కిమ్ కిమ్ ప్రాక్టీస్ మొదలుపెట్టబోతోందనమాట.
ఇక కిమ్‌కిమ్ నేపథ్యం గురించి చెప్పాలంటే మణిపూర్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లి హాయ్‌ఛాంగ్ ఖాంగ్సాయ్ తండ్రి జాంగ్‌ఖోలిమ్ ఖాంగ్సాయ్. వీరు కుకి సామాజిక వర్గానికి చెందినవారు. తల్లి ఒక స్కూలు టీచర్‌గా పనిచేస్తుండగా తండ్రి సామాజిక కార్యకర్త. ఇద్దరూ బ్యాడ్మింటన్ ప్లేయర్లు కావడం విశేషం. మణిపూర్‌లో జరిగిన కొన్ని పోటీల్లో వీరు పాల్గొని గోల్డ్ మెడల్స్ పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మణిపూర్ పొమ్మన్నప్పటికీ... హైదరాబాద్ అక్కున చేర్చుకోవడంపై కిమ్ కిమ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications