వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిపై ఎఫ్ఐఆర్: పోటీ కాదన్న కేజ్రి
వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్న అజయ్ రాయ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారణాసిలోని పోలింగ్ బూత్‌కు వచ్చిన అజయ్ రాయ్ ఎన్నికల నియమావళిని అతిక్రమించడంతో ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పోలింగ్ కేంద్రంలో క్యూలో నిలబడి ఓటర్లకు చెయ్యి చూపించాడని అజయ్ రాయ్‌పై ఇతర పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీ గుర్తు చెయ్యి కావడంతో ఆయన ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని ఇతర పార్టీల వారు ఆరోపించారు. దీంతో అజయ్ రాయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారణాసి రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది.

ఈ మేరకు వారణాసి అధికారులు అజయ్ రాయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా అజయ్ రాయ్ పోలింగ్ కేంద్రం సమీపంలో మీడియాతో ఎన్నికల గురించి మాట్లాడారని వచ్చిన ఆరోపణలనూ పరిశీలించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా, వారణాసి లోకసభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ నాకు పోటీ కాదు: కేజ్రివాల్, మోడీ ఓటమి ఖాయం
కాంగ్రెస్ పార్టీ తనకు పోటీనే కాదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వారణాసి లోకసభ బిజెపి అభ్యర్థి నరేంద్ర మోడీ ఓటమి ఖాయమని అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీదే విజయమని ఆయన చెప్పారు. సోమవారం వారణాసి లోకసభ స్థానానికి ఎన్నికలు జరిగాయి.












Click it and Unblock the Notifications