కరోనా వేళ భారత్‌కు తుఫాన్ గండం... అరేబియా సముద్రంలో అల్పపీడనం... వాతావరణ శాఖ కీలక ప్రకటన...
ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్‌లో మరికొద్ది రోజుల్లో తుఫాన్ వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 14 నాటికి అరేబియా సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా ఈ నెల 16 నాటికి బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.
Recommended Video
'తుఫాన్‌కు సంబంధించి పలు అంచనాలు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ఒమన్ వద్ద ఇది తీరం దాటవచ్చు,మరో అంచనా ప్రకారం దక్షిణ పాకిస్తాన్ వద్ద తీరం దాటవచ్చు,అంటే గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలపై దీని ప్రభావం ఉండవచ్చు.' అని వాతావరణ శాఖ అధికారి సునీతా దేవీ తెలిపారు.

ఈ తుఫాన్‌ను 'తౌక్టే'గా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఇది భారత తీరాన్ని తాకితే ఈ ఏడాది దేశంలో ఇదే మొదటి తుఫాన్ అవుతుందన్నారు. దీని ప్రభావంతో కేరళ,లక్షద్వీప్,కర్ణాటక,తమిళనాడు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఈ నెల 14 నుంచి సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.
తుఫాన్ ప్రభావంతో మాల్దీవులు,లక్షద్వీప్‌లలో గంటకు 60కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే వారాంతంలో ఇక్కడి సముద్రంలో ఒక మీటరు ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది.
సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా మోహాపాత్రా దీనిపై మాట్లాడుతూ... తుఫాన్ ఏ దిశను తీసుకుంటుందన్నది ఇప్పుడే చెప్పడలేమన్నారు. అల్పపీడన తీవ్రతను వాతావరణ శాఖ నిశితంగా గమనిస్తోందని.. తదనుగుణంగా తగిన సూచనలు జారీ చేస్తుందని తెలిపారు.
గతేడాది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అంఫన్ తుఫాన్,అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుఫాన్ భారత్‌లోని కొన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తౌక్టే తుఫాన్ సూచనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు తుఫాన్ అంతరాయం కలిగించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications