యూపీ తొలి విడత పోలింగ్ ఆరంభం : 58 సీట్లు - 623 మంది అభ్యర్ధులు: అందరి చూపు అటువైపే..!!
వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి చూపు ఉత్తర ప్రదేశ్ వైపే ఉంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉత్తర ప్రదేశ్ లో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. అందులో భాగంగా తొలి విడత పోలింగ్ ఆరంభమైంది. మొత్తం 11 జిల్లాల్లోని 58 స్థానాలకు ఈ పోలింగ్ ప్రక్రియ మొదలైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కీలకమైన షామ్లీ, ముజఫర్‌నగర్, బాగ్‌పత్, మీరట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, హాపూర్, బులంద్‌షహర్, అలీఘర్, మధుర, ఆగ్రాలలో పోలింగ్ జరగనుంది. ప్రస్తుత క్యాబినెట్‌లోని 8 మంది మంత్రులు కూడా తొలిదశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కరోనా - భద్రతా చర్యలు కట్టుదిట్టం
జాట్‌లు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో ఈ దశ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనల్లో ఈ ప్రాంతానికి చెందిన రైతాంగం పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి ర్యాలీలు, రోడ్‌షోలను ఎన్నికల సంఘం అనుమతించలేదు. ప్రతీ నియోజకవర్గంలోనూ సున్నితమైన ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల సంఘం తదనుగుణంగా ఏర్పాట్లు చేసింది.
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. అదే విధంగా కోవిడ్ కారణంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేశారు. సిబ్బందికి గ్లౌజులు, ఫేస్ మాస్క్‌లు, ఫేస్ షీల్డ్‌లు, పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉంచారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించాలని ఓటర్లకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

50 వేల మంది భద్రతా సిబ్బందితో
11 జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద 50 వేలమంది పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక అధికారులతో నిఘా ఏర్పాటు చేసారు. ఈ రోజు జరుగుతున్న పోలింగ్ లో మొత్తం 58 నియోజకవర్గాల్లోని 2.28 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.24 కోట్ల మంది పురుషులు, 1.04 కోట్ల మంది మహిళలు, 1448 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
తొలి దశ ఎన్నికల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 623 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో 73 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొదటి దశలో 26027 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి విడతలో 120,876 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.

58 సీట్లు - 623 మంది అభ్యర్ధులు
తొలి విడత పోలింగ్ ప్రారంభమైన ఈ 11 జిల్లాల్లోనూ అధికార బీజేపీ - ప్రతిపక్షాల మధ్య హోరా హోరీ పోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇదే 58 నియోజకవర్గాల్లో 2017 ఎన్నికల్లో 53 స్థానాలు గెలుచురుంది. ఎస్పీ, బీఎస్పీ చెరో రెండు స్థానాల్లో, ఆర్‌ఎల్‌డీ ఒక స్థానంలో విజయం సాధించాయి. మొత్తం ఏడు వితలుగా జరిగే యూపీ ఎన్నికల్లో రెండో విడత ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న వెల్లడికానున్నాయి.
Recommended Video

జాట్‌లు అధికంగా ఉన్న ప్రాంతంలో ఎన్నికలు
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాల మాఫీతోపాటు 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్టు పేర్కొంది. వడ్లు, గోధుమలను క్వింటాకు రూ.2,500 చొప్పున, చెరకును రూ.400 చొప్పున కొంటామని హామీ ఇచ్చింది. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు మంగళవారమే మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. ప్రస్తుతం ప్రారంభమైన పోలింగ్ సరళిని అంచనా వేసేందుకు ప్రధాన పార్టీల నేతలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications