అయోధ్య గర్భగుడిలో ప్రధాని సహా ఐదుగురు వ్యక్తులు..
అయోధ్య రామాలయంలో ఈ నెల 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమం కోసం యావత్ భారతదేశమంతా ఎంతగానో ఎదురుచూస్తుంది. ఇలాంటి తరుణంలో అయోధ్య గర్భగుడిలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ఐదుగురు వ్యక్తులు ఉండనున్నారు. అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు మరో నలుగురు వ్యక్తులు కీలకపాత్ర పోషించనున్నారు.
ఈ మహత్తర కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా జరగనుంది. ఆ సమయంలో ఆయనతోపాటు మరో నలుగురు వ్యక్తులు కూడా అక్కడ ఉండనున్నారు. వారు ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయోధ్యలో జనవరి 22 వ తేది మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు 84 సెకన్ల సమయంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. ఆ సమయంలో మోదీతో పాటు గర్భగుడిలో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉండనున్నట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రామమందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఉండనునన్నట్లు ఆలయ ట్రస్టు వివరించింది.

మూడు బృందాల ఆచార్యుల పూజలు నిర్వహిస్తారు...
ఇక, ఈ మహత్తర కార్యక్రమం సమయంలో అయోధ్యలోని రాముని ఆలయాన్ని మూసి ఉంచనున్నారు. బల రాముడు గర్భగుడిలో కొలువుదీరనున్న స్థానంలో ఉంచే వరకు ఆ విగ్రహానికి కళ్లగంతలు ఉంటాయి. ఈ కార్యక్రమం పూర్తైన వెంటనే ఆ కళ్లకు గంతలను తొలగించనున్నారు. ప్రాణప్రతిష్ట కంటే ముందు ప్రధాని శ్రీరాముడి కళ్లకు కట్టిన గంతలను విప్పనున్నారు. అనంతరం అద్దంలో రాముడికి తన విగ్రహాన్ని చూపించడంతో ఈ మహత్తర కార్యక్రమం పూర్తి కానుంది. ఆ తర్వాత బలరామునికి హారతి ఇవ్వడం జరుగుతుంది. హారతి అనంతరం మూడు బృందాలతో ఉన్నఆచార్యులు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి బృందానికి స్వామి గోవింద్ దేవగిరి మహరాజ్, రెండవ బృందానికి శంకరాచార్య విజేంద్ర సరస్వతి, మూడవ బృందం కాశీ పండితుల నేతృత్వంలో ఈ పూజలను నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications