షాక్: పన్నీర్ వర్గంలోకి ఐదు మంది మంత్రులు జంప్ ! సీఎం సమావేశం
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. చిన్నమ్మ శశికళ వర్గంలో ఉన్న మంత్రులు ఇప్పుడు ఎడప్పాడి ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు గుప్పుమన్నాయి. గత మూడు రోజుల నుంచి ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యకుండా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మౌనంగా ఉన్నారు.
అయితే తెరవెనుక ఆయన వర్గీయులు చెయ్యాల్సింది చేస్తూనే ఉన్నారని శుక్రవారం వెలుగు చూసింది. ఎడప్పాడికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను తమ వర్గంలో చేర్చుకోవాలని ఇన్ని రోజులు ప్రయత్నాలు చేస్తున్న పన్నీర్ సెల్వంకు ఊహించిన మద్దతు వచ్చిందని విశ్వసనీయ సమాచారం.

ఎమ్మెల్యేలకు గాలం వేస్తే మంత్రలు పడ్డారు
శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలకు పన్నీర్ సెల్వం వర్గం గాలం వేసింది. అయితే ఎడప్పాడి పళనిసామి మంత్రి వర్గంలోని ఐదు మంది మంత్రులు పన్నీర్ సెల్వం వర్గంలో చేరడానికి సిద్దంగా ఉన్నారని శుక్రవారం వెలుగు చూసింది. అయితే ఆ మంత్రులు పేర్లు బయటకు రాకుండా పన్నీర్ సెల్వం వర్గం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తెరవెనుక నుంచి చక్రం తిప్పుతున్నది ఈయనే
పన్నీర్ సెల్వంకు పూర్తి మద్దతు ఇచ్చి 12 మంది ఎంపీలు ఆయన వర్గంలో చేరడానికి కీలకపాత్ర పోషించిన అన్నాడీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి మంత్రి వర్గంలోని ఐదు మంది మంత్రులు పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చేలా పావులుకదిపారని సమాచారం.

నేడు మంత్రి వర్గ సమావేశం
శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలోని సచివాలయంలో తమిళనాడు కేబినెట్ సమావేశానికి ఎడప్పాడి పళనిసామి పిలుపునిచ్చారు. ఈనెల మూడు లేదా నాలుగో వారంలో బడ్జెట్ సమావేశాలకు పిలుపునివ్వాలని ఎడప్పాడి పళనిసామి కసరత్తులు చేస్తున్నారు.

సీన్ మారిపోయింది
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల రాకతో ముందుగానే అన్నాడీఎంకే ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. మళ్లీ అధికార పగ్గాలు తామే చేపట్టడంతో అనుబంధంగా బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇప్పటి వరకు అన్నాడీఎంకే పాలనలో పన్నీర్ సెల్వం బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు పరిస్థితిపూర్తిగా మారిపోయింది. మొదటిసారి ఆర్థిక శాఖా మంత్రి జయకుమార్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కసరత్తులు చేస్తున్నారు.

బడ్జెట్ సమావేశాల తరువాత జంప్ !
తమిళనాడు బడ్జెట్ సమావేశాలు పూర్తి అయిన వెంటనే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలోని ఐదు మంది మంత్రులు తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోతారని సమాచారం. అయితే అంతకు ముందే ఎడప్పాడి పనళనిసామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేయాలని పన్నీర్ వర్గీయులు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఎవరెవరు జంప్ చేస్తున్నారు ?
పన్నీర్ సెల్వం స్కెచ్ గురించి తెలుసుకున్న సీఎం ఎడప్పాడి పళనిసామి గురువారం రాత్రి పోద్దుపోయిన తరువాత అందుబాటులో ఉన్న మంత్రులతో తన ఇంటిలో అత్యవసర సమావేశం అయ్యారు. నన్ను నమ్మండి మీకు ఏమికావాలన్నా చేసిపెడుతానని ఎడప్పాడి పళనిసామి మంత్రులను బుజ్జగించారని సమాచారం. అదే సమయంలో పన్నీర్ సెల్వం వర్గంలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్న మంత్రులు ఎవరు ? అంటూ ఎడప్పాడి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించారని తెలిసింది.

బలపరీక్ష కాదు ఇప్పుడు అగ్ని పరీక్ష
ప్రజలను ఆకర్షించే బడ్జెట్ ప్రవేశపెట్టాలని సీఎం ఎడప్పాడి, ఆర్థిక శాఖా మంత్రి జయకుమార్ కసరత్తులు చేస్తుంటే అన్నాడీఎంకే పార్టీలో శశికళ అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ పెత్తనం ఎక్కువ అయ్యిందని, ఆయన వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని అసహనంగా ఉన్న మంత్రులు పన్నీర్ సెల్వం వర్గంలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని తమిళ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.












Click it and Unblock the Notifications