లండన్ సిగ్నల్ కోసం ఢిల్లీలో హసీనా వెయిటింగ్ ! గతంలో భారత్ శరణార్థులుగా వీరే..!
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అల్లర్ల నేపథ్యంలో ఆర్మీ హెచ్చరికతో ప్రధాని పదవిని వదిలేసి భారత్ పారిపోయి వచ్చేసిన షేక్ హసీనా కేంద్రం ఆతిధ్యంతో ఢిల్లీలో అతిధిగా ఆశ్రయం పొందుతున్నారు. అయితే భారత్ లోనూ ఎక్కువ కాలం ఉండటం ఎవరికీ మంచిది కాదన్న సూచనలతో ఆమె బ్రిటన్ ను శరణు కోరారు. అయితే బ్రిటన్ ప్రభుత్వం కూడా హసీనాకు శరణార్ధిగా స్వీకరించేందుకు ఆలోచిస్తోంది. దీంతో ప్రస్తుతానికి హసీనా ఢిల్లీలోనే వేచి చూస్తున్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్‌లోని సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. లండన్ నుంచి కాల్ వస్తే తప్ప భారత్ నుంచి ఆమె బయలుదేరి వెళ్లే అవకాశాలు లేకపోవచ్చు. మరోవైపు ఢాకాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను న్యూఢిల్లీ నిశితంగా పరిశీలిస్తోందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే విదేశాంగమంత్రి జైశంకర్ ప్రధాని మోడీతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని విడివిడిగా కలిసి తాజా పరిణామాల్ని వివరించారు. దీంతో ప్రధాని కేబినెట్ భేటీ ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు భారత్ వైమానిక దళం, సైన్యం, సరిహద్దు భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది.

మరోవైపు భారత్ లో ప్రస్తుతానికి తాత్కాలిక శరణార్ధిగా ఉన్న షేక్ హసీనా గతంలోనూ ఓసారి శరణార్ధిగా ఉన్నారు. 1975లో హసీనా తల్లితండ్రులు, కుటుంబ సభ్యుల హత్యల తర్వాత 1981 వరకూ ఢిల్లీలోని పండారా రోడ్డులో ఆమె పిల్లలతో కలిసి రహస్య శరణార్ధిగా ఉన్నారు. హసీనా కాకుండా బౌద్ధగురువు దలైలామా, మాల్దీవుల నేతలు మొహమ్మద్ నషీద్, అహ్మద్ అదీబ్ అబ్దుల్ గపూర్, ఆప్ఘనిస్తాన్ నేత అబ్దుల్లా అబ్దుల్లా, శ్రీలంక నేత వరదరాజ్ పెరుమాళ్ వంటి వారికి భారత్ శరణార్ధులుగా కొంతకాలం ఆశ్రయం ఇచ్చింది. వాళ్ల స్వదేశాల్లో పరిస్ధితులు చక్కబడ్డాక తిరిగి వీరిలో కొందరు వెళ్లిపోగా.. దలైలామా వంటి వారు ఇక్కడే శాశ్వత శరణార్దులుగా ఉండిపోయారు.












Click it and Unblock the Notifications