యడియూరప్పను టిష్యూ పేపర్ లా చూస్తున్న బీజేపీ హైకమాండ్, ఇంత అవమానమా ?, కేపీసీసీ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయాల్లో ఎవరికి ఎవరు ఎప్పుడు మద్దతు ఇస్తారో చెప్పడం చాలా కష్టం. బీజేపీని ఇరుకున పెట్టడానికి మాజీ సీఎం పేరును ముందు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ హైకమాండ్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను ఇంతకాలం వాడుకున్న బీజేపీ హైకమాండ్ ఇప్పుడు అప్పను టిష్యూ పేపర్ తో సమానంగా చూస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక మాజీ సీఎం బీఎస్. యడియూరప్పతో సోమవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యి కొన్ని నిమిషాలు మాత్రమే చర్చించారు. జేపీ నడ్డా, బీఎస్ యడియూరప్పల మధ్య కేవలం 10 నిమిషాలు మాత్రమే చర్చలు జరిగాయని. తరువాత యడియూరప్ప ఢిల్లీ నుంచి విమానంలో బెంగళూరుకు ఒంటరిగా బయలుదేరి వచ్చేశారని కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
కర్ణాటక మాజీ సీఎం, లింగాయత్ వర్గంలో చాలా బలమైన నాయకుడు అయిన బీఎస్. యడియూరప్పను ఢిల్లీ పిలిపించి అక్కడ ఆయన్ను రూమ్ బయట పెట్టి లోపల కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర రాష్ట్రాల నాయకులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు గురించి చర్చించారని, ఆ రూమ్ లో యడియూరప్ప కుర్చోవడానికి కనీసం కుర్చీ కూడా లేదా అంటూ కేపీసీసీ నాయకులు బీజేపీ హైకమాండ్ ను ప్రశ్నించారు..

కర్ణాటకలో బీజేపీ ఎదగడానికి, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి బీఎస్ యడియూరప్ప బలమైన కారణం అని, అలాంటి లింగాయత్ ల నాయకుడు బీఎస్. యడియూరప్పను అడ్డం పెట్టుకుని కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఇప్పుడు అదే యడియూరప్ప చులకన, చేదు అయిపోయారని, ఇది లింగాయత్ లకు అవమానం అంటూ కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చర్చించడానికి బీఎస్. యడియూరప్పకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు. ఆయనకు అర్హత లేదనా ?, లేక ఆయనతో మాకు పనిలేదని అనుకున్నారా ? అని మీరు కన్నడిగులకు సమాధానం చెప్పాలని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ హైకమాండ్ ను నిలదీసింది.
ఢిల్లీలోని బీజేపీ పెద్దలు యడియూరప్పను అవమానించారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు, యడియూరప్ప అనుచరులను కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. యడియూరప్పను అడ్డం పెట్టుకుని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ హైకమాండ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే ఈ విషయంలో బీఎస్, యడియూరప్ప అనుచరులు మౌనంగా అన్ని గమనిస్తూ ఏం చెయ్యాలో అదే చేద్దామని డిసైడ్ అవుతున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications