అమిత్ షా, యడియూరప్పతో కిరణ్ భేటీ-కర్నాటక ఎన్నికల్లో కీలక బాధ్యతలు ?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో బీజేపీ కీలక నేతలు అమిత్ షా, కర్నాటక మాజీ సీఎం యడియూరప్పతో భేటీ అయ్యారు. వీరిద్దరితో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. త్వరలో జరిగే కర్నాటక ఎన్నికల నేపథ్యంలో కిరణ్ వీరిద్దరితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీలో దాదాపు నాలుగేళ్ల పాటు సీఎం పదవిలో ఉన్న కిరణ్ .. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం నాలుగేళ్ల తర్వాత తిరిగి అదే పార్టీలో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లోనే ఉంటున్న కిరణ్.. తాజాగా ఆ పార్టీని వీడి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు కిరణ్ ను పార్టీలో చేర్చుకున్న బీజేపీ ఆయన్ను పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వాడుకునేందుకు సిద్ధమవుతోంది.

ఇవాళ ఢిల్లీలో అమిత్ షా, యడియూరప్పతో భేటీ అయిన కిరణ్ కుమార్ రెడ్డి.. కర్నాటక ఎన్నికల్లో తాజా పరిస్ధితులపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలో కిరణ్ ను కర్నాటక ఎన్నికల ప్రచార బరిలోకి దింపేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కర్నాటక జిల్లాల్లో ఆయనతో ప్రచారం చేయించే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలకు చెందిన కిరణ్... కన్నడ భాషలోనూ ప్రావీణ్యం ఉన్నందున ఆయనతో ప్రచారం చేయిస్తే బీజేపీకి ప్రయోజనం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది.













Click it and Unblock the Notifications