సెటిల్ మెంట్లు చేస్తుంటే చూస్తున్న సీఎం, మాకు నీతులు చెబుతారా ?, మీరు సిద్దమా ?, మేము రెఢీ !
మాజీ ఎంపీ కుపేంద్ర రెడ్డికి ఓటు వేయాలని పార్టీయేతర ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారన్న కాంగ్రెస్ నేతల ఆరోపణపై కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కౌంటర్ ఇచ్చారు.ఈ విషయమై మాట్లాడిన మాజీ సీఎం కుమారస్వామి బెదిరింపుల సంస్కృతి నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరు? సెటిల్ మెంట్ చేసే సంస్కృతి ఎవరిది ? అని సిద్దరామయ్య ప్రభుత్వంలోని పెద్దలను ప్రశ్నించారు.
ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ భూముల్లో తీగ కంచెలు వేసేదెవరు? అని కుమారస్వామి కాంగ్రెస్ నాయకులను సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడితే నేరమా? ఇంతకు ముందు మీరు బీజేపీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి మాట్లాడటం నేరం కాదా?, మీరు ఏమి చేస్తున్నారు అని అడిగితే మా మీద ఎదురు దాడి చెయ్యడానికి ప్రయత్నిస్తారా అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు.

బీజేపీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని మాట్లాడటం తప్పా? జేడీఎస్‌కు ఓట్లు పడతాయని చెప్పారని, అది తప్పా అని మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. ఎవరినైనా బెదిరించే సంస్కృతి మీకు ఉందని, అలాంటి సంస్కృతి మాది కాదని కుమారస్వామి అన్నారు.
ఎనుగుల దాడిలో మరణించిన కేరళ వ్యక్తికి 15 లక్షలు పరిహారం ఇచ్చిన విషయంపై మాట్లాడిన మాజీ సీఎం కుమారస్వామి జాతీయ నేతల సలహా మేరకు సిద్దరామయ్య బాధితులకు రూ.15 లక్షలు పరిహారం ఇచ్చారని అన్నారు.

కేంద్రం నుంచి నిధులు రాలేదని, ఇది కన్నడిగులకు అన్యాయం అని సిద్దరామయ్య అంటున్నారని, వెయ్యి సార్లు అబద్దాలు చెప్పి దానిని నిజం చెయ్యడానికి సిద్దరామయ్య అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. దేశంలో చాలా మంది ఆర్థిక నిపుణులు ఉన్నారని, వారితో కలిసి బహిరంగ చర్చకు సీఎం సిద్దరామయ్య సిద్దం కావాలని, కేంద్రం నుంచి కర్ణాటకకు అన్యాయం జరుగుతోందని వెలుగు చూస్తే వాళ్లు ఏమి చెబితే అది చేస్తామని మాజీ సీఎం కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సవాలు విసిరారు.
రామనగరలో న్యాయవాదుల నిరసనలు, ధర్నాల విషయంలో మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడుతూ రామనగర సమస్యకు సంబంధించి అధికారులను ఈ ప్రభుత్వం బానిసల్లా వాడుకుంటోందని మండిపడ్డారు. శివుడి దేవాలయంలో పూజలు చేసే వాళ్లను ఒకలాగా, మసీదుకు వెళ్లే వాళ్లను మరో రకంగా సిద్దరామయ్య ప్రభుత్వం చూస్తోందని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చెయ్యడానికి జేడీఎస్ సిద్దం అయ్యింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడుతూ సిద్దరామయ్య ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications