మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత: రైతుల పక్షపాతి
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అధినేత ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు అజయ్ సింగ్ చౌతాలా, అభయ్ సింగ్ చౌతాలా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గుర్‌గావ్‌లోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి కారణం- కార్డియాక్ అరెస్ట్.
ఆయన మృతిపట్ల హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దిగ్గజ రాజకీయ నాయకుడిని కోల్పోయామని వ్యాఖ్యానించారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన గురువుగా అభివర్ణించారు. దేశ రాజకీయాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఉప ప్రధానమంత్రి దేవీలాల్ కుమారుడే ఓం ప్రకాష్ చౌతాలా. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 1989లో తొలిసారిగా సీఎం కుర్చీని అధిష్ఠించారు. తొలి మూడుసార్లు అతి తక్కువ కాలంలో పదవిని కోల్పోయారు. తొలి విడత- 171, రెండో దశ- 5, మూడో విడతలో 15 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. నాలుగో విడతలో మాత్రం పూర్తికాలం పదవిలో కొనసాగారు.
ఓం ప్రకాష్ చౌతాలా పార్థివ దేహానికి శనివారం మధ్యాహ్నం సిర్సాలోని తేజా ఖేరాలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఈ సాయంత్రం పార్థివ దేహాన్ని అక్కడికి తరలించే అవకాశం ఉంది.
ఓపీ చౌతాలా మృతిపట్ల హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, జనతాదళ్ (యునైటెడ్) నాయకులు కేసీ త్యాగి సంతాపం తెలిపారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. రైతుల పక్షపాతిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications