కుప్పకూలిన అబ్దుల్ కలాం: కన్నుమూత

షిల్లాంగ్: మాజీ భారత రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడిచారు. అంతకు ముందు సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఐఐఎంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను షిల్లాంగ్‌లోని ఎస్పీ ఖాసీ హిల్స్‌లోని ఎం ఖర్కరంగ్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రికి తరలించేలోగానే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయనకు ఆస్పత్రిలోని ఐసియులో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది. ఆయన వయస్సు 84 ఏళ్లు. అయితే ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
ఐఐఎంలో బి స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన కుప్ప కూలిపోయారు. ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారని, ఆయనను పరీక్షిస్తున్నామని, గుండెపోటు వచ్చి ఉంటుందని భావిస్తున్నామని బెథాని ఆస్పత్రి డైరెక్టర్ జాన్ సైలో రింటాథియాంగ్ చెప్పారు. కలాం 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేశారు.
భారతదేశం 11వ రాష్ట్రపతిగా ఆయన పనిచేశారు. ఆయన 1931 అక్టోబర్ 15వ తేదీన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. మిస్సైల్ మ్యాన్‌గా ఆయన ప్రఖ్యాతి వహించారు. షిల్లాంగ్ వెళ్తున్నానంటూ ఆయన చివరగా ట్వీట్ చేశారు. లివబుల్ ప్లానెట్‌పై షిల్లాంగ్ ఐఐఎంలో ప్రసంగించడానికి వెళ్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. పేపర్ బాయ్ నుంచి ఆయన భారత రాష్ట్రపతి పదవిని అధిష్టే స్థాయికి ఎదిగారు.పేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం అవిహితుడు. సైన్యం కోసం చిన్న హెలికాప్టర్‌ను తయారు చేయడం ద్వారా ఆయన తన వృత్తిని ప్రారంభించారు. 1998 పోఖ్రాన్ - 2 అణు పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇందులో ఆయన రాజకీయ, సాంకేతిక సలహాదారుగా పనిచేశారు.
మద్రాసు ఐఐటిలో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చదివారు. ఇండియా 2020, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాలను ఆయన రచించారు. ఆయన మృతికి వారం రోజుల పాటు భారత ప్రభుత్వం సంతాపదినాలను ప్రకటించింది.
అబ్దుల్ కలాం మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. కాగా, అబ్దుల్ కలాం భౌతిక కాయం ఈ అర్తరాత్రి ఢిల్లీకి చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications