వన్ వేలోకి దూసుకెళ్లిన కారు, కంటేనర్ ఢీ: నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు దుర్మరణం !
కారు అదుపుతప్పి వన్ వేలోకి దూసుకెళ్లి కంటేనర్ ను ఢీకొని నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలో జరిగింది. కేరళకు చెందిన జోయద్ జాకబ్, దివ్యా, వేలూరులో
బెంగళూరు: కారు అదుపుతప్పి వన్ వేలోకి దూసుకెళ్లి కంటేనర్ ను ఢీకొని నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలో జరిగింది. కేరళకు చెందిన జోయద్ జాకబ్, దివ్యా, వేలూరులోని వీఐటీయు కాలేజ్ కు చెందిన నిఖిత్, జీనా అనే నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు.
బెంగళూరులోని రాజరాజేశ్వరినగరలోని మెడికల్ కాలేజ్ లో జోయద్ జాకబ్, దివ్యా ఎంబీబీఎస్ చదువుతున్నారు. తమిళనాడులోని వేలూరులోని వీఐటీయు కాలేజ్ లో చదువుతున్న నిఖిత్, జీనా బెంగళూరు వచ్చారు. వీరు నలుగురు KA 53 AM 1801 కారులో మైసూరు వెళ్లారు.

గురువారం అర్దరాత్రి నలుగురు మైసూరు నుంచి కారులో బెంగళూరు బయలుదేరారు. మార్గం మధ్యలో శుక్రవారం వేకువ జామున 3.30 గంటల సమయంలో బిడిది సమీపంలోని కెంపనహళ్ళి గేట్ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొనింది.
కారు వన్ వే లోకి దూసుకెళ్లి బెంగళూరు నుంచి మైసూరు వైపు వెలుతున్న HR 55, Y 5331 నెంబర్ కంటేనర్ ను ఢీకొనింది. కారు కంటేనర్ ముందు భాగంలో దూసుకెళ్లడంతో నలుగురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.

విషయం తెలుసుకున్న డీఎస్పీ ఎంకే. తమయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నలుగురి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడపడం వలన ప్రమాదం జరిగిందా ? అనే విషయం పోస్టుమార్టుం రిపోర్టులో వెలుగు చూడనుందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications