మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస: కాల్పుల్లో నలుగురు మృతి
ఇంఫాల్: నూతన సంవత్సర ప్రారంభం రోజునే మణిపూర్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. తాజాగా చోటు చేసుకున్న ఘటనపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ స్పందించారు. హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

అమాయక ప్రజల ప్రాణాలు తీయడం చాలా బాధాకరం. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను పంపించాం. గాలింపు చర్యల్లో పోలీసులకు సహకరించాలని స్థానికులను కోరుతున్నా. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. బాధితులకు న్యాయం చేకూర్చేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది అని సీఎం బీరేన్ సింగ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో తాజా పరిస్థితులపై సీఎం సమీక్షించారు. తోబల్, ఇంఫాల్ ఈస్ట్, కాక్ చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు. కాగా, గత ఏడాది మే నెలలో రెండు వర్గాల మధ్య చెలరేగిన వైరం కారణంగా 180 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, గత కొంత కాలంగా ప్రశాంత వాతావరణం నెలకొంటుందన్న సమయంలో తాజాగా, మరోసారి హింసాత్మక ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.












Click it and Unblock the Notifications