ఢిల్లీ ఉత్కంఠకు తెర, ఎన్నికల దిశగా..: కేజ్రీవాల్ కంగ్రాట్స్
న్యూఢిల్లీ: ఢిల్లీ కథ మొదటికొచ్చింది. మళ్లీ ఎన్నికల నిర్వహణ అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ కొత్త సర్కారును ఏర్పాటు చేసేందుకు ససేమిరా అంటోంది.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ మూడు పార్టీల ప్రతినిధులతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సోమవారం విస్తృత మంతనాలు జరిపారు. ఎన్నికల జరపాల్సిన ఆవసరం లేకుండా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో మూడు పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించారు.
తగిన బలంలేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని మూడు పార్టీలు ఈ సందర్భంగా తెగేసి చెప్పాయని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. చర్చల సారాంశాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లెఫ్టినెంట్ గవర్నర్ నివేదిక ద్వారా వివరించనున్నారు.

అన్ని పార్టీలు తాజాగా ఎన్నికలు నిర్వహించాలనే కోరుకుంటున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ తమకు తెలిపారని ఆమ్ ఆద్మీ నాయకుడు మనీష్ సిసోడియా తెలిపారు. ఢిల్లీలో ఏర్పడ్డ రాజకీయ ప్రతిష్టంభనను తొలగించాలంటే తాజాగా ఎన్నికలు జరపడమే సరైన పరిష్కారమని తాము మొదటి నుంచీ చెబుతూ వస్తున్నామని అన్నారు.
సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరిపేందుకు వీలుగా అసెంబ్లీని రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలతో పాటే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరినట్టు కాంగ్రెస్ నాయకుడు హరూన్ యూసుఫ్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాని నేపథ్యంలో ఏఏపీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు కంగ్రాట్స్ చెప్పారు.
ఇదిలా ఉండగా, కేంద్రంలో దోస్తీ రాష్ట్రంలో కుస్తీ అన్నట్టుగా తయారవుతోంది బీజేపీ, లోక్‌జనశక్తి మధ్య రాజకీయ అనుబంధం. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్‌జనశక్తి జమ్ము కాశ్మీర్‌లో ఇప్పుడు బీజేపీపై తలపడడానికి సిద్ధమవుతోంది. అయితే తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. ఎన్నికల పరిస్థితిని అంచనా వేసేందుకు శ్రీనగర్‌కు వచ్చిన ఆయన పొత్తులను ప్రస్తావించారు.
ఎవరి వ్యూహాలు వారికుంటాయని, రాష్ట్రంలో ఆ పార్టీపై తలపడడం దాదాపు ఖాయమని చెప్పారు. పొత్తులనేవి కేంద్రానికే పరిమితమని, రాష్ట్ర రాజకీయాలకు వర్తించవని అన్నారు. అయితే జార్ఖండ్‌లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని పాశ్వాన్ ప్రకటించారు.
మరోవైపు, జార్ఖండ్‌లో భావసారూప్య పార్టీల తో బీజేపీ జట్టుకడుతోంది. గతంలో ఐదు స్థానాలతో ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఆల్ జార్ఖండ్ స్టూ డెంట్స్ యూనియన్, ఈ దఫా ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకుంది. 81 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఏజేఎస్‌యూ 8 స్థానాలు కోరింది. బీజేపీ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి భూపిందర్ యాదవ్ సూచన మేరకు అమిత్‌షా అందుకు అంగీకరించారు.
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
ఢిల్లీలో అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఆమోదం తెలిపారు. దానికి సంబంధించిన నివేదికను వెంటనే కేంద్రానికి పంపారు. దాంతో, ప్రస్తుతం అసెంబ్లీ అచేతనావస్థలోకి వెళ్లిపోయింది. అసెంబ్లీ రద్దు అంశంపై చర్చించేందుకు కేంద్ర క్యాబినెట్ ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం కానుంది.












Click it and Unblock the Notifications