చమురు కంపెనీలకు రేట్లను తగ్గించడమూ తెలుసు: పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: సుమారు రెండు నెలల పాటు వాహనదారులను బెంబేలెత్తించాయి చమురు సంస్థలు. పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పెంచుకుంటూ పోయాయి. ఈ ఏడాది మే 4వ తేదీన మొదలైన ఇంధన ధరల పెరుగుదల సుమారు రెండు నెలల పాటు యథేచ్ఛగా కొనసాగింది. పెంచడానికి ముందురోజు 75 రూపాయలకు కాస్త అటు, ఇటుగా ఉన్న ఫ్యూయల్ ప్రైస్.. వంద రూపాయల మార్క్‌ను దాటి మరింత పైపైకి చేరేంత దాకా కొనసాగింది. వరుస బాదుడుతో వాహనదారులకు చుక్కలు కనిపించాయి.
వాహనం బయటికి తీయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పట్లో. ఈ వరుస పెంపుదలకు పుల్‌స్టాప్ పెట్టాయి చమురు సంస్థలు. కొంతకాలంగా ఇంధన ధరల పెంపుదల జోలికి వెళ్లలేదు. పైగా కొంతమేర తగ్గించుకుంటూ వస్తోన్నాయి. సెప్టెంబర్ నెల ప్రారంభం రోజు.. వాటి రేట్లను మరోసారి స్వల్పంగా తగ్గించాయి. పెట్రోల్‌పై లీటర్ ఒక్కింటికి 10 నుంచి 15 పైసలు, డీజిల్‌పై లీటర్ ఒక్కింటికి 14 నుంచి 15 పైసల మేర తగ్గించాయి.

తాజా తగ్గింపుతో దేశ రాజధానిలో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి రూ.101.34 పైసలకు చేరింది. డీజిల్ రూ.88.77 పైసలు పలుకుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు 107.39 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.96.33 పైసలకు చేరింది. కోల్‌కతలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.101.72 పైసలకు చేరగా డీజిల్ రూ.91.84 పైసలు పలుకుతోంది. చెన్నైలో పెట్రోల్ రూ.99.08 పైసలు, డీజిల్ రూ.99.38 పైసలుగా రికార్డయింది.
దేశంలో అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులోనే ఇంధన ధరలు ఒకింత తక్కువగా ఉంటోన్నాయి. తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై మూడు రూపాయల పన్నును తగ్గించడమే దీనికి కారణం. భోపాల్‌లో పెట్రోల్ రూ.109.58 పైసలకు చేరగా, డీజిల్ రూ.97.40 పైసలుగా నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.40 పైసలు, డీజిల్ రూ.96.84 పైసలు, బెంగళూరులో పెట్రోల్ రూ.104.84 పైసలు, డీజిల్ ధర తగ్గి రూ.94.19 పైసలకు చేరింది. లక్నోలో పెట్రోల్ రూ.98.29 పైసలు, డీజిల్ రూ.89.02 పైసలుగా నమోదైంది.
అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.98.39 పైసలు, డీజిల్ రూ.95.85 పైసలు పలుకుతోంది. ఇంధన రేట్లు కాస్త తగ్గుముఖం పట్టడం కొంత ఊరట కలిగించినట్టయింది. నామమాత్రపు తగ్గింపు కావడం వల్ల అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు 100 రూపాయలపైగానే ఉంటోంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, లఢక్ వంటి పలు చోట్ల వంద రూపాయల మార్క్‌కు దిగువకు నమోదు కాలేదు.












Click it and Unblock the Notifications