మెరుపు సమ్మె: పెట్రోల్ బంకులు మూత
Petrol and Diesel price: పెట్రోల్ బంకుల యజమానులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రాజస్థాన్ పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ సభ్యులు మెరుపు సమ్మెకు దిగారు. ఈ తెల్లవారు జామున 6 గంటలకు సమ్మె ఆరంభమైంది. 48 గంటల పాటు కొనసాగనుంది.
రాజస్థాన్ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో రాత్రికి రాత్రి సమ్మెకు పిలుపునిచ్చారు డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు.ఈ పరిణామం వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోంది. పెట్రోల్ కోసం బంకుల వరకూ వచ్చి.. వెనక్కి తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కొందరు తమ వాహనాలను నెట్టుకుంటూ వెళ్లడం కనిపించింది.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్నును తగ్గిస్తామని, డీలర్ల కమీషన్ మొత్తాన్ని పెంచేలా ఆయిల్ కంపెనీలపై ఒత్తిడిని తీసుకొస్తామనీ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, రోజులు గడుస్తున్నప్పటికీ.. ఈ హామీలు అమలు కావట్లేదు.
దీనికి నిరసనగా రాజస్థాన్ పెట్రోల్ డీలర్ల అసోసియేషన్.. సమ్మెకు దిగింది. 48 గంటల పాటు అంటే మంగళవారం తెల్లవారు జామున 6 గంటల వరకు కొనసాగిస్తుంది. వ్యాట్‌ను తగ్గించుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశించినప్పటికీ.. ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని పాటించట్లేదని అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర సింగ్ భాటీ అన్నారు.

వ్యాట్‌ను తగ్గించేలా తక్షణ చర్యలను తీసుకోవాలంటూ తాము కొంతకాలంగా ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు డిమాండ్ చేస్తూ వస్తోన్నామని, దీనిపై ఎలాంటి సానుకూల స్పందన ఉండట్లేదని చెప్పారు. తమ కమీషన్ రేట్లను పెంచేలా ఆయల్ కంపెనీలపై ఒత్తిడిని తీసుకొస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications