రెబల్స్ తో గాలి జనార్దన్ రెడ్డి సీక్రేట్ చర్చలు, వర్కౌట్ అయితే చుక్కలే !
బెంగళూరు/గంగావతి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నాయకుల జీవితాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని నాయకులు రెబల్స్ గా మారే అవకాశం ఉందని స్పష్టంగా కనపడుతోంది. మరో వైపు రెబల్స్ ను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు నిమగ్నం అయ్యారు.
టిక్కెట్లు దక్కని నాయకులు వేరే పార్టీ విజయం కోసం పరోక్షంగా సహకరించాలని కొందరు అనుకుంటుంటే మరి కొందరు మాత్రం ఏమైతే అదికాని అంటూ రెబల్స్ గా మారిపోతున్నారు. కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని గంగావతికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ హెచ్ఆర్. శ్రీనాథ్ గంగావతి ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ తిరిగారు.

అయితే మాజీ ఎమ్మెల్సీశ్రీనాథ్ కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరే నాయకుడికి టిక్కెట్ ఇచ్చేశారు. శనివారం మద్యాహ్నం స్థానిక సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే పరన్న మునవళ్లి, బీజేపీ సీనియర్ నాయకుడు బసవరాజ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ శ్రీనాథ్ ఇంటికి వెళ్లి ఆయనతో చాలా సేపు చర్చలు జరిపారు.
శనివారం రాత్రి కేఆర్ పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా మాజీ ఎమ్మెల్సీ శ్రీనాథ్ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరపడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ విషయంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనాథ్ కాని, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కాని క్లారిటీ ఇవ్వలేదు. మేము మామూలుగా కలిశామని ఇద్దరు నాయకులు అంటున్నారు. మొత్తం మీద రెబల్స్ ను తన పార్టీ నుంచి పోటీ చేయించాలని గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications