లైంగిక బాధితులపై వీడియోలా..? హైకోర్టు సంచలన ఉత్తర్వులు
సమాజంలో చట్టాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు బాధితుల ఆవేదనను పట్టించుకునే వారు కరువవుతుంటారు. ముఖ్యంగా లైంగిక నేరాల బారిన పడిన బాధితుల గోప్యత, వారి గౌరవం డిజిటల్ యుగంలో తీవ్రమైన ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్‌ల కోసం ఒక బాధితురాలి గుర్తింపును బజారుకీడ్చడాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ హైకోర్టు, డిజిటల్ దిగ్గజాలకు దిమ్మతిరిగేలా ఒక కీలకమైన చారిత్రక తీర్పును వెలువరించింది.
లైంగిక బాధితురాలిపై వీడియోలు, బాధ్యతా రహితంగా సోషల్ మీడియా
ఒక లైంగిక బాధితురాలి గుర్తింపును, ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో యథేచ్ఛగా ప్రసారం చేస్తూ ఆమె ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న వందలాది పోస్టులపై హైకోర్టులో పోరాటం మొదలైంది. బాధితురాలి తరఫున హైకోర్టు న్యాయవాది నాగుర్‌బాబు రంగంలోకి దిగారు. యూట్యూబ్, గూగుల్, మెటా ,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి దిగ్గజ సంస్థలకు అనేకసార్లు చట్టబద్ధంగా విజ్ఞప్తులు చేసినప్పటికీ, ఆ ప్లాట్‌ఫారమ్‌లు బాధ్యతారహితంగా వ్యవహరించాయి.

తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు
చట్టవిరుద్ధమైన ఆ కంటెంట్‌ను తొలగించడంలో విఫలమవడంతో, న్యాయవాది నాగుర్‌బాబు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి పోరాటం సాగించారు.ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి బాధితురాలి గోప్యతకు ప్రాధాన్యతను ఇచ్చారు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14, 21 హక్కులను, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను గుర్తుచేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు:
తక్షణం సోషల్ మీడియా నుండి వీడియోలు తొలగించాలని ఆదేశం
పిటిషన్‌లో పేర్కొన్న 200కు పైగా యూట్యూబ్ వీడియోలు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ పోస్టులను తక్షణమే తొలగించాలని యూట్యూబ్, గూగుల్, మెటా, ఎక్స్‌లను కోర్టు ఆదేశించింది. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు అన్ని సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఆగస్టు 20, 2026కి వాయిదా వేసింది.
లైంగిక నేరాల బారిన పడిన బాధితులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ఉత్తర్వులు
ఇంటర్నెట్‌లో ఒకసారి కంటెంట్ అప్‌లోడ్ అయితే అది శాశ్వతంగా బాధితుల జీవితాలను నరకప్రాయం చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో న్యాయవాది నాగుర్‌బాబు ఎన్ చేపట్టిన ఈ న్యాయ పోరాటం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు కనువిప్పు కలిగించేలా ఉంది. బాధితుల గౌరవాన్ని కాపాడటంలో ఆన్‌లైన్ మధ్యవర్తుల బాధ్యతను ఈ తీర్పు స్పష్టం చేసింది. డిజిటల్ వేదికలపై గోప్యత హక్కును పునరుద్ఘాటించిన ఈ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు, లైంగిక నేరాల బారిన పడిన బాధితులకు కొండంత ధైర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications