దెబ్బకు దెబ్బ: కళ్లు గప్పి మరీ: చైనా అడ్డుకున్న ప్రాజెక్టును పూర్తి సత్తా చాటిన భారత్
న్యూఢిల్లీ: చర్చల పేరుతో దొంగ దెబ్బ తీసిన చైనాపై భారత్ ప్రతీకారాన్ని తీర్చుకుంది. చైనా దేన్నయితే అభ్యంతరం వ్యక్తం చేసిందో.. దేన్నయితే అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసిందో.. ఆ ప్రాజెక్టును పూర్తి చేసింది భారత్. అదే- గాల్వన్ వ్యాలీ బ్రిడ్జి నిర్మాణం. గాల్వన్ వ్యాలీ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినట్లు ఆర్మీ అధికారులు ధృీవీకరించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఆర్మీ అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. లఢక్ ఈశాన్య ప్రాంతంలో నిర్మిస్తోన్న ఈ గాల్వన్ బ్రిడ్జి నిర్మాణాన్ని చైనా మొదటి నుంచీ అడ్డుకుంటూ వస్తోంది.
అయినప్పటికీ.. దాని నిర్మాణ పనులను భారత్ కొనసాగించింది. 60 మీటర్ల పొడవు ఉన్న ఈ వంతెన.. దర్బక్ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీని అనుసంధానించే మార్గంలో నిర్మించారు. దర్భక్ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీ అవుట్ పోస్ట్ మధ్య దూరం సుమారు 255 కిలోమీటర్లు. గాల్వన్ వ్యాలీ నదీ తీరం వెంబడి కొనసాగుతుంది ఇది. కరాకోరం పాస్‌లోని చిట్టచివరి మిలటరీ అవుట్ పోస్ట్ అయిన దౌల్ బేగ్ ఓల్డీని చేరుకోవడంలో ఈ వంతెన కీలకంగా మారుతుందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు.

ఒకవంక చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికుల అడ్డుపడుతున్నప్పటికీ.. ఆర్మీ ఇంజినీర్లు ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు అధికారులు స్పష్టం చేశారని జాతీయ మీడియా పేర్కొంది. గాల్వన్ నదీ తీర ప్రాంతాన్ని తమదిగా చెప్పుకొంటోన్న చైనా పీఎల్ఏ సైనికులు.. మొదటి నుంచీ ఈ వంతెన నిర్మాణాన్ని అడ్డుకుంటోన్న విషయం తెలిసిందే. ఒకరకంగా ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తడానికి ఓ కారణమని చెబుతున్నారు.
గాల్వన్ నది-షియోక్ నది సంగమించే ప్రదేశమైన పెట్రోలింగ్ పాయింట్-14కు ఈశాన్య దిశగా మూడు కిలోమీటర్ల దూరంలో, బెయిలె బ్రిడ్జికి ఈశాన్య దిశగా రెండు కిలోమీటర్ల దూరంలో ఈ బ్రిడ్జిని నిర్మించారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. తాము ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను నిలిపివేయకూడదని నిర్ణయించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ప్రాణాంతక ఘర్షణలు చోటు చేసుకున్న సమయంలోనూ ఆర్మీ ఇంజినీర్లు వంతెన నిర్మాణాన్ని నిలిపి వేయలేదని స్పష్టం చేశారు. బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితే ఎదురైతే.. పరోక్షంగా చైనా సైనికుల ఒత్తిళ్లకు తలొగ్గినట్టవుతుందని ఆర్మీ అధికారులు భావించినట్లు జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది.












Click it and Unblock the Notifications