మళ్లీ ఆకాశానికి క్రూడాయిల్ ధరలు..! ట్రంప్ చెప్పిన ఒక్క మాటతో..!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం ముగిసిపోయి కాల్పుల విరమణ కొనసాగుతూ, త్వరలో తుది శాంతి ఒప్పందం కూడా కుదురుతుందని భావిస్తున్న తరుణంలో 24 గంటల్లో ఒక్కసారిగా పరిస్ధితి మారిపోయింది. ముఖ్యంగా దివంగత సుప్రీం లీడర్ అంత్యక్రియలతో భావోద్వేగంలో ఉన్న ఇరాన్ హార్ముజ్ లో నౌకలపై దాడులకు దిగడంతో, అమెరికా ప్రతిదాడులు చేపట్టింది. వీటికి ప్రతిగా మళ్లీ ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ లను టార్గెట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ లో సీజ్ ఫైర్ ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటన మొత్తం స్టోరీని మళ్లీ మొదటికి తీసుకొచ్చేసింది.
మళ్లీ చమురు మంట.. (Crude Oil)
ట్రంప్ ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ ఎగబాకడం ప్రారంభించాయి. చమురు సరఫరాపై కొత్త ఆందోళనలు నెలకొనడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 78 డాలర్లకు చేరువైంది. ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లకు మొగ్గు చూపారు.ఇవాళ ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 5 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 77 డాలర్లకు పైగా ట్రేడైంది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ కూడా గణనీయంగా లాభపడింది. గత కొన్ని వారాల్లో నమోదైన అత్యధిక స్థాయికి చమురు ధరలు చేరాయి.

ట్రంప్ చేసిన ప్రకటనతో
టర్కీలో జరిగిన నాటో సమావేశం సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్‌తో ఉన్న అవగాహన ఒప్పందం ఇక అమల్లో లేదని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్‌తో కొత్త చర్చలు కొనసాగించే ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లలో చమురు సరఫరాపై భయాందోళనలను మరింత పెంచాయి. ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. ఇరాన్‌పై అమెరికా తీసుకున్న తాజా చర్యలు, హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

80 డాలర్లకు క్రూడాయిల్ ?
చమురు సరఫరాపై ఆందోళనలు ఇలాగే కొనసాగితే బ్రెంట్ క్రూడ్ ధర త్వరలోనే బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయిని తాకే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు అమెరికా-ఇరాన్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగితే ముడి చమురు ధరల్లో మరోసారి భారీ హెచ్చుతగ్గులు నమోదయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.














Click it and Unblock the Notifications