తిరుమల వెళ్తున్నారా, దర్శనాలపై TTD కీలక అప్డేట్ - సెప్టెంబర్ వరకు అమలు..!!
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో వీధులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. అలిపిరి టోల్ గేట్ నుంచి వాహనాల రద్దీ కనిపిస్తోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో సెప్టెంబర్ వరకు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు.. శ్రీవారి బ్రహ్మోత్సవాల పైన టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది.
భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. జూలై నుండి సెప్టంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు వివరాలు ప్రకటించిన టీటీడీ ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూలై నెల నుండి సెప్టంబర్ 30వ తేది వరకు వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాల రద్దు వివరాలను ప్రకటించింది. బ్రేక్ దర్శనాల రద్దుతో పాటుగా కారణాలను వివరించింది. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 17న ఆణివార ఆస్థానం, జూలై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, జూలై 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం, ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, ఆగస్టు 24న పవిత్రోత్సవాల రెండో రోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

రెండు సార్లు బ్రహ్మోత్సవాలు
అదే విధంగా ఈ ఏడాది రెండు సార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. అందులో భాగంగా సెప్టెంబరు 8న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ తో సహా సెప్టంబర్ 15 నుండి 23వ తేది వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వేళ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ తేదిలకు సంబంధించి ముందు రోజు తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించరని స్పష్టం చేసారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాల్సిందిగా టీటీడీ సూచించింది.













Click it and Unblock the Notifications