సోనియా, రాహుల్ కు భారీ ఊరట..! ఈడీకి ఢిల్లీ కోర్టు షాక్..!
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఇవాళ భారీ ఊరట లభించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో క్రిమినల్ కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరిపై ఈడీ ఇప్పటికే మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. అయితే ఈ కేసును విచారణకు స్వీకరించేందుకు ఢిల్లీ కోర్టు ఇవాళ నో చెప్పేసింది. దీంతో నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందంటూ వాదిస్తున్న ఈడీకి షాక్ తగిలినట్లయింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై ఈడీ ఇప్పటికే మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈడీ నమోదు చేసిన కేసు చూస్తుంటే ఓ ప్రైవేటు వ్యక్తి చేసిందని అర్ధమవుతోందని, ఎఫ్ఐఆర్ ఆధారంగా నమోదు చేసిందని కాదని తెలుస్తోందని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే తెలిపారు. కాబట్టి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ కొనసాగించలేమని తేల్చేశారు.

ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు సుమన్ దూబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్ , సునీల్ భండారీలను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితులుగా చేర్చింది. వీరిపైనే ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్ధిక నేరాల విభాగం కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదుచేయడం చెల్లదని ఢిల్లీ కోర్టు తేల్చేసింది.
గతంలో నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ను సోనియా, రాహుల్ తో పాటు ఆరుగురు కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ఉన్న యంగ్ ఇండియా స్వాధీనం చేసుకోవడంలో అక్రమాలు జరిగాయనేది ఇక్కడ ఆరోపణ. వీటిపై ఏళ్ల తరబడి దర్యాప్తులు జరుగుతున్నా, వారిని విచారణకు సైతం పిలిపించినా ఈడీ కానీ, ఇతర దర్యాప్తు సంస్థలు కానీ ఏమీ తేల్చలేకపోయాయి.












Click it and Unblock the Notifications