ఎంపీల సస్పెన్షన్: నల్లబ్యాడ్జీలతో సోనియా, రాహుల్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం ఆందోళనకు దిగారు. సస్పెన్షన్ ను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు.
ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌లు చేతికి నల్లబ్యాడ్జీలు కట్టుకుని పాల్గొన్నారు.
సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం 25మంది ఎంపీలను అయిదు రోజుల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీకి సమాజ్ వాదీ, తృణమూల్ కాంగ్రెస్ మద్దుతు తెలిపాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా, కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌పై మంగళవారం ఉభయసభలు దద్దరిల్లాయి. విపక్షాలకు చెందిన ఎంపీలు రెండు సభల్లోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామికమని నినదించాయి.
విపక్షాల నిరసనలతో రాజ్యసభ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా పడింది. కాగా, నిరసనల హోరులోనే లోకసభ సమావేశాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications